కోడెల, కేసీఆర్.. ఏంటా పర్సనల్ టాక్?

Update: 2015-10-23 07:09 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అనేక విశేషాలకు వేదికైన సంగతి తెలిసిందే. ఊహించని అతిథులు రావడం... రావాల్సినవారు అలగడం.. ఇలా ఎన్నో రాజకీయ పరిణామాలకూ అమరావతి సాక్షీభూతంగా నిలిచింది. ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రజలకు తనపై ఉన్న కోపం మొత్తం పోయేలా చేసుకోగలిగారు. అయితే.. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ఆయన అక్కడ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో మాట్లాడడం అందరిలో ఆసక్తి పెంచింది.

అమరావతి వేదికగా కేసీఆర్ - కోడెలలు ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా ఆలింగనం చేసుకుని చేతిలో చేయివేసి కబుర్లు చెప్పుకొన్నారు. టీడీపీలో ఒకప్పటి దోస్తులైన వారిద్దరూ అన్నా అంటే అన్నా అనుకుంటూ ఎన్ని రోజుల తరువాత కలిశామో కదా అంటూ ముచ్చట్లలో మునిగిపోయారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇతర కార్యక్రమాలను కోడెల చేపడుతున్న సంగతి తెలుసుకున్న కేసీఆర్ ఆ వివరాలన్నీ కోడెలను అడిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులంతా సత్తెనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తున్నారని... చాలాబాగా చేయడం వల్లే ఢిల్లీ వరకు తెలిసిందని కోడెలను కేసీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్ లో కలిసేందుకు సమయం ఇవ్వాలంటూ కేసీఆరే కోడెలను కోరడం విశేషం.

మొత్తానికి సుదీర్ఘకాలం టీడీపీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు చాలా కాలం తరువాత ఇలా కలుసుకోవడం, మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
Tags:    

Similar News