కుటుంబ సమేతంగా నెల రోజులు లండన్ లోనే కోహ్లి..

Update: 2022-07-16 10:49 GMT
వెస్టిండీస్ తో వన్డే, టి20 లకు విశ్రాంతి పేరిట "దూరమైన" మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. కొన్నాళ్లు కుటుంబంతో లండన్ లోనే ఉండిపోనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న
వన్డే సిరీస్ లో ఆడుతున్న కోహ్లి.. ఆదివారం జరిగే మూడో వన్డే అనంతరం కూడా ఇంగ్లండ్ లోనే కొనసాగనున్నాడు. ఈ నెలాఖరు నుంచి వెస్టిండీస్ తో అమెరికా, కరీబియన్ దీవుల్లో
ప్రారంభం కానున్న వన్డే, టి20 సిరీస్ లలో కోహ్లి ఆడడం లేదు. అయితే, జట్టు మాత్రం అటునుంచి అటే కరీబియన్ దీవులకు వెళ్తుంది. ఈ రెండు జట్లల్లోనూ విరాట్ కోహ్లి సభ్యుడు
కానందున స్వదేశానికి తిరిగి రావాలి. అయితే, అతడు మాత్రం ఇంగ్లండ్ లోనే కొన్ని రోజులు ఉండిపోనున్నాడు. కాగా, భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే ఆదివారం మాంచెస్టర్ లోని ఓల్డ్
ట్రఫోర్డ్ స్టేడియంలో ఆదివారం జరుగనుంది. సిరీస్ లో ఇంగ్లాండ్ లో టీమిండియా ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ
రెండు దేశాల మధ్య టి20 సిరీస్ మొదలవుతుంది. దీనికోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే జట్టును ప్రకటించింది. చోటు దక్కనివారు స్వదేశానికి తిరిగి వస్తారు.

మళ్లీ 45 రోజుల తర్వాతే.. లేదా 2 నెలలు? కోహ్లి మైదానంలో కనిపించేంది రెండు నెలల తర్వాతేనా? చాలాకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లి.. మళ్లీ ఆసియా కప్ కోసం ఎంపిక చేసే జట్టులో మాత్రమే చూడగలం.ఆగస్టు 27న ఆసియా కప్ ఆరంభమౌతుంది. దీనికి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన
ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అంటే.. దాదాపు 45 రోజుల తర్వాతే కనీసం కోహ్లిని ఇండియా తరఫున చూడగలం. అయితే, ఫామ్ లోలేని కోహ్లిని ఆసియా కప్ నకు ఎంపిక చేస్తారా? అనేది
అనుమానమే. అతడు ఆదివారం నాటి మ్యాచ్ లో కనీసం పరుగులు చేయకుంటే కష్టమే. అయితే, ఇంగ్లండ్ లో ఉండిపోనున్న కోహ్లి.. ఈ సమయాన్ని కుటుంబం కోసం
కేటాయించనున్నాడు. భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికాతో కలిసి నెల పాటు లండన్‌లో నివసించబోతోన్నాడు. ఆ తరువాత అతను స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇప్పటికే అనూష్క శర్మ
కుమార్తెతో కలిసి లండన్‌కు చేరుకున్నారు కూడా. ఈ నెల రోజుల పాటు లండన్‌లో ఎక్కడ ఉండబోతున్నారనేది కూడా బయటపడలేదు.

ఇదో రిక్రియేషన్ సమయం ఏ వ్యక్తికైనా కుటుంబమే పెద్ద బలం. ఇంట్లోని వారితో ఎంత ఎక్కువ సమయం గడిపితే ఆ బలం మరింత పెరుగుతుంది. ఆ లెక్కన ఈ నెల రోజులు కోహ్లికి పెద్ద రిక్రియేషన్ అనడంలో సందేహం లేదు. ఫామ్ లో లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న అతడు వ్యక్తిగతంగా తనను తాను పునరావిష్కరించుకోవడానికి తగిన సమయం దొరికింది. తద్వారా పూర్తి స్థాయిలో రీచార్జ్
అయ్యే అవకాశం కలిగింది. తద్వారా పేలవ ఫామ్‌తో.. ఆత్మవిశ్వాస లేమితో.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న దశ నుంచి అతడు బయటపడొచ్చు.

టి20 ప్రపంచ కప్ లో ఉంటాడా?అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ జరుగనుంది. దానికి జట్టు కూర్పుపై సమాలోచనలు సాగుతున్నాయి. దీపక్‌ హుడా వంటి ఆల్ రౌండర్, ఇషాన్‌ కిషన్‌, సూర్య కుమార్‌ వంటి హిట్టర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో పాగా వేస్తున్నారు. ఇంతటి తీవ్ర పోటీలో వారిని పక్కకుపెట్టి.. కోహ్లిని ప్రపంచ కప్‌ నకు ఎంపిక చేయడం సరైనదేనా? అనే
అభిప్రాయం కలుగుతోంది. కప్‌ నేపథ్యంలో ఇప్పటినుంచే కోహ్లిపై చర్చ జరగడం జట్టుకు మంచిది కాదు కూడా. విరామం తీసుకుని  పునరుత్తేజితంతో సాగాలనుకుంటున్న కోహ్లీకి ఆశించిన
ఫలితాలు దక్కాలని ఆశిద్దాం.
 
రేపు సెంచరీ కొట్టకుంటే.. వెయ్యి రోజుల మార్క్ దాటినట్లే..నవంబరు 23, 2019లో బంగ్లాదేశ్‌పై కోహ్లీ చివరి సెంచరీ సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతడికది 70వది. ఇవన్నీ తను 4,114 రోజుల్లోనే సాధించడం విశేషం. కాన ఇప్పటికి 967 రోజులవుతున్నా కూడా కోహ్లీ నుంచి మరో సెంచరీని చూడలేకపోయాం. ఇలా వెయ్యి రోజులైనా శతకం బాదలేకపోయాడనే విమర్శల నుంచి తప్పించుకోవాలంటే ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే అతడికి చివరి అవకాశం కానుంది.

దీంట్లోనూ ఎప్పటిలాగే విఫలమైతే వెయ్యిరోజులను దాటేసినట్టే అవుతుంది. ఎందుకంటే తను కరీబియన్‌ టూర్‌లో లేడు కాబట్టి తిరిగి బ్యాట్‌ పట్టేది ఆగస్టు 27 నుంచి జరిగే ఆసియా కప్‌లోనే. కానీ అదే నెల 18కి అతను వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఈ స్టార్‌ బ్యాటర్‌
టెస్టులో 11, 20 రన్స్‌ చేయగా.. రెండో టీ20లో 2, మూడో టీ20లో 11, రెండో వన్డేలో 16 పరుగులు చేశాడు. ఇంతటి పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లీ నుంచి మరో శతకాన్ని
ఆశించడం అత్యాశే అవుతుందా? లేక మునుపటి సత్తాతో అందరికీ జవాబు ఇస్తాడా? అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News