షా అరెస్ట్ మాట‌పై త‌గ్గిన మ‌మ‌త‌!

Update: 2018-08-02 04:54 GMT
మామూలుగానే ప‌డ‌దు. తాజాగా అస్సాం జాతీయ పౌర రిజిస్ట‌ర్  (ఎన్నార్సీ) పుణ్య‌మా అని మ‌మ‌తా బెన‌ర్జీకి.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. అస్సోంలో చేప‌ట్టిన ఎన్సార్సీ త‌ర‌హాలోనే ప‌శ్చిమ బెంగాల్ లోనూ చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని.. బెంగాల్ లో అక్ర‌మంగా ఉన్న బంగ్లాదేశీయుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న ప్ర‌చారంపై మమ‌త తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అస్సోం త‌ర‌హాలోనే ప‌శ్చిమ‌బెంగాల్ లోనూ అక్ర‌మంగా ఉన్న బంగ్లాదేశీయుల‌ను పంపిస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టిస్తే.. రాజ‌కీయంగా అదో తీవ్ర‌మైన అంశంగా మార‌ట‌మే కాదు.. పెను మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని మ‌మ‌త భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఈ నెల (ఆగ‌స్టు) 11న బీజేపీ యువ మోర్చా నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన భారీ ర్యాలీకి మ‌మ‌త స‌ర్కార్ అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీనిపై అమిత్ షా నేరుగా స్పందించ‌ట‌మే కాదు.. ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌ర‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. ఒక‌వేళ అనుమ‌తి ఇవ్వ‌కున్నా తాను కోల్ క‌త్తాకు వ‌స్తాన‌ని.. ద‌మ్ముంటే అరెస్ట్ చేసుకోవాలంటూ స‌వాల్ విసిరారు. దీంతో ర్యాలీ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వేడి పుట్టించ‌ట‌మే కాదు.. వెను వెంట‌నే నిర్ణ‌యం తీసుకోకుంటే ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌న్న అభిప్రాయానికి దీదీ స‌ర్కారు వ‌చ్చింది.

ర్యాలీకి అనుమ‌తి ఇచ్చే విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా ఉన్న దీదీ.. షా స‌వాల్ తో వెన‌క్కి తగ్గిన‌ట్లుగా చెబుతున్నారు. ర్యాలీకి అనుమ‌తి ఇవ్వ‌ని పోలీసులు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య అనంత‌రం అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో.. ర్యాలీపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర ప‌డిన‌ట్లైంది.

ఎన్నార్సీలో స‌రైన ఓటర్ల‌ను క‌ల‌ప‌కుండా బీజేపీ ఓటుబ్యాంకు రాజ‌కీయం చేస్తుంద‌ని మమ‌త ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో త‌న‌ను సైతం చొర‌బాటుదారు   అనేస్తారేమో అన్న అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. నా త‌ల్లిదండ్రులు ఇక్క‌డే పుట్టార‌నే బ‌ర్త్ స‌ర్టిఫికేట్ లేదు.. ల‌క్కీగా నా బ‌ర్త్ స‌ర్టిఫికేట్ ఉందంటూ ఎద్దేవా చేశారు.బీజేపీకి తానేమీ ప‌ని మ‌నిషిని కాద‌న్న మ‌మ‌త‌.. 2019లో విప‌క్షాల‌న్నీ ఏక‌మై బీజేపీ ప‌ని ప‌డ‌తార‌ని.. ఆ పార్టీ ప‌ని అయిపోయిన‌ట్లేన‌ని మండిప‌డ్డారు. మొండి దీదీ సైతం షా అరెస్ట్ స‌వాల్ కు దిగిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News