కొస బంధం తెంచుకున్న విజయసాయి!
ఇక మరి కొద్ది గంటలలో జనవరి నెల ముగుస్తుంది అనగానే ఆయన వైసీపీకి కూడా అదే ఊపులో రాజీనామా చేసేశారు.
బందాలను తెంచుకుని బాధ్యతలను తెంచుకుని తాను కోరుకున్న స్వేచ్ఛా జీవితంలోకి ఒకనాటి వైసీపీ బిగ్ పిల్లర్ వి విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు. జనవరి 25న ఆయన వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసి బిగ్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఇక మరి కొద్ది గంటలలో జనవరి నెల ముగుస్తుంది అనగానే ఆయన వైసీపీకి కూడా అదే ఊపులో రాజీనామా చేసేశారు.
ఇక ఈ చర్యతో అన్ని బంధాలను ఆయన తెంచుకున్నట్లు అయింది. నిజానికి తాను రాజకీయాలకే స్వస్తి పలుకుతున్నట్లుగా ప్రకటించిన తరువాత వైసీపీకి రాజీనామా చేయడం లాంచనమే అవుతుంది. అయితే ఆయన ఇపుడు ఆ లాంచనాన్ని కూడా పూర్తి చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటి అంటే తాను తీసుకున్న నిర్ణయం ఎంతటి కమిట్మెంట్ తో కూడుకున్నదో చాటి చెప్పడానికే అని అంటున్నారు.
అంటే తన దారి కరెక్ట్ అని ఎంతో ఆలోచించిన మీదటనే తాను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను అని విజయసాయిరెడ్డి గట్టిగా చెప్పదలచారు అని అంటున్నారు. అంతే కాదు రాజకీయ బంధాలను తెంచుకోవడం ద్వారా తాను ఇక మీదట అజాత శత్రువుని అని కూడా తెలియ చేయదలచారు అంటున్నారు.
ఇక ఆయన జగన్ కి చివరి సారిగా కలసి ఎన్నాళ్ళు అయిందో వైసీపీ పార్టీ వారే చెప్పగలరు. అయితే ఆయన వైసీపీకి పునాదిగా ఉండి దశాబ్దాల కాలంగా పనిచేసిన వ్యక్తిగా ఇంతటి అతి పెద్ద నిర్ణయం తీసుకుంటున్నపుడు జగన్ ని చివరిసారి కలుస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఫోన్ ద్వారానే జగన్ కి తన సంచలన నిర్ణయం తెలియచేశారు.
ఇక వైసీపీకి రాజీనామా కూడా జగన్ ని కలవకుండానే ఆన్ లైన్ ద్వారానే పంపినట్లుగా ఉన్నారని అంటున్నారు. మూడు తరాలుగా వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా హితుడిగా ఎంతో సేవలు అందించిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి అనూహ్యంగా నిష్క్రమించడం అన్నది అతి పెద్ద విశేషం అవుతోంది. అదే సమయంలో ఆయన పార్టీకి పదవులకు, రాజకీయాలకు దూరం కావచ్చు కానీ వైఎస్సార్ కుటుంబంతో ఉన్న దశాబ్దాల బంధానికి దూరం అవుతున్నారా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.
ఎందుకంటే రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన ఆయన వైఎస్సార్ కుటుంబంతో ఆ రాగ బంధాన్ని కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ ఆయన జగన్ తో భేటీని కోరుకోకపోవడం తాను వైసీపీకి రాజీనామా చేశాను అని జగన్ లండన్ టూర్ నుంచి తిరిగి వస్తున్న రోజునే ట్వీట్ ద్వారా ప్రకటించడంతో ఆయన ఇక మీదట జగన్ తో కనిపించే చాన్స్ ఉందా లేదా అని కూడా అంతా ఆలోచిస్తున్నారు.
ఇక వైసీపీకి అంతా మంచి జరగాలని జగన్ 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం గా ప్రమాణం చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి కొసమెరుపు మెరిపించారు. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి వైసీపీతోనే కాదు వైఎస్సార్ కుటుంబంతోనూ అన్ని బంధాలు తెంచుకుని బయటకు వెళ్ళిపోయారా అన్నదే చర్చగా సాగుతోంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.