కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుర్చీకి డీకే-మెయిలీ ఎసరు పెడుతున్నారా?
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తున్నారు.;
కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ రాజకీయాలు ఒక్కసారిగా రాజుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు బహిరంగ మద్దతు పెరుగుతోంది.
ఇటీవల కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహాశివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వేదికను పంచుకోవడం కర్ణాటక రాజకీయాల్లో పెనుసునామీకి దారితీసింది.
మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ ఉద్రిక్తతను రేకెత్తించాయి. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. శివకుమార్‌లో మంచి నాయకత్వ లక్షణాలున్నాయని, ఆయన పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు బహుమతిగా ఇవ్వాల్సినది కాదని, కష్టపడి సంపాదించుకున్నదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందిస్తూ, వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యల గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదని, ఆయన ఏం చెప్పారనేది తనకు తెలియదని తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. బూత్ స్థాయిలో కమిటీలను సమీక్షించేందుకు త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ స్పందిస్తూ, వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. డీకే శివకుమార్ కఠినంగా శ్రమించినందుకు రివార్డ్ దక్కడం ఖాయమని, అయితే ఈ విషయాన్ని తేల్చేది పార్టీ హైకమాండ్ మాత్రమేనని అన్నారు. పార్టీ, ప్రజల కోసం పనిచేసిన వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని చెప్పారు.