విజయసాయికి అడ్వాన్స్ కంగ్రాట్స్...ఆ పదవి ఖాయమా ?

ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.;

Update: 2025-03-03 19:30 GMT

రాజకీయాల నుంచి దూరంగా జరిగాను అని సన్యాసం స్వీకరించిన వి విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ కూడా చేశారు.

ఇక విజయసాయిరెడ్డి ఈ విధంగా ఒక అధికారిక కార్యక్రమంలో ఒక్కసారిగా మెరవడం విశేషం అయితే అదే సమయంలో అక్కడకు వచ్చిన వారిలో అనేక మంది అడ్వాన్స్ గా కంగ్రాట్స్ అని ఆయనకు చెప్పడం జరిగిందని ఒక ప్రచారం సాగుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమణ ప్రకటించిన విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు, ఏ విషయం మీద అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.

విజయసాయిరెడ్డికి తొందర్లోనే రాజ్ భవన్ లో అడుగుపెట్టే యోగం ఉందని అంటున్నారు ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారు అన్న ప్రచారం జోరందుకుంది. అక్కడ గవర్నర్ రవి పదవీ కాలం తొందర్లో పూర్తి అవుతుందని ఆ ప్లేస్ లోకి విజయసాయిరెడ్డిని తీసుకుని వస్తారని అంటున్నారు.

విజయసాయిరెడ్డ్ నెల్లూరు జిల్లా వాసి. తమిళనాడుకు దగ్గరవారు. పైగా పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఆయనకు ఈ కీలకమైన రాష్ట్రం బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి మేలు చేస్తారని భావిస్తున్నారుట. ఇక రాజకీయ వ్యూహాలలో మేధావితంబంలో విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దల మనసు చూరగొన్నారని అంటున్నారు.

ఆయన తన రాజ్యసభ పదవీ కాలం మూడున్నరేళ్ళు పైగా ఉండగానే త్యాగం చేయడం వెనక కూడా బీజేపీ పెద్దల నుంచి ఈ తరహా అభయం ఉందని అంటున్నారు. రాజకీయాలకు సెలవు అని ఆయన అన్నారు అందుకే ఆయన రాజకీయ పదవులు చేపట్టబోరని అంటున్నారు. అదే సమయంలో గవర్నర్ వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవి. రాజ్యాంగబద్ధమైన పదవులు అవి.

బహుశా ఈ కోణం నుంచి ఆలోచించే విజయసాయిరెడ్డి ఈ రకంగా రాజకీయాలకు చెక్ చెప్పారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ గా రెండు సార్లు కొనసాగినా వైసీపీలో ఆయనకు కొత్తగా దక్కే పదవులు ఏవీ లేవు. దానికి బదులుగా గవర్నర్ గా పనిచేస్తే ఆ హోదావే వేరు అని అంటున్నారు.

అందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అన్న చర్చ ఉంది. ఇక విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో కూడా పెట్టడంతో చదవాల్సిన వారి కోసమే ఆయన అలా చేశారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కొద్ది కాలం ఆగితే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వంటి సంచలన ప్రకటన వెనక పరమార్ధం తెలుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News