ప్రపంచ ప్రజాస్వామ్య గ్లోబల్ ర్యాంకింగ్స్.. భారత్ స్థానమెంతంటే?

ప్రతి సంవత్సరం ఈ సంస్థ 167 దేశాల్లో ప్రజాస్వామ్య స్థాయిని అంచనా వేసి, 0 నుంచి 10 వరకు స్కోర్ కేటాయించి ర్యాంకులను ప్రకటిస్తుంది.;

Update: 2025-03-03 22:30 GMT

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిస్థితి రోజురోజుకీ సంక్షోభంలో పడుతున్నట్లు "ది ఎకనమిస్ట్" కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) తాజాగా ప్రకటించిన గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2024 వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ 167 దేశాల్లో ప్రజాస్వామ్య స్థాయిని అంచనా వేసి, 0 నుంచి 10 వరకు స్కోర్ కేటాయించి ర్యాంకులను ప్రకటిస్తుంది.

ఈ నివేదిక ప్రకారం, నార్వే 9.81 పాయింట్లతో వరుసగా 16వ సంవత్సరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. న్యూజీలాండ్, స్వీడన్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే, ప్రజాస్వామ్య పరంగా అత్యంత బలహీనంగా నిలిచిన దేశాల జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, మయన్మార్ (166), ఉత్తర కొరియా (165), చైనా (145), లావోస్ (160), వియత్నాం (133) దేశాలు కూడా ప్రజాస్వామ్య పరంగా బలహీనంగా నిలిచాయి. అఫ్ఘానిస్తాన్ కేవలం 0.25 పాయింట్లు మాత్రమే సాధించి 167వ ర్యాంకులో ఆఖరున నిలిచింది. తాలిబాన్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మహిళల హక్కులు, మీడియా స్వేచ్ఛ హరించబడటంతో దేశ పరిస్థితి మరింత దారుణంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది.

పాకిస్తాన్ ప్రజాస్వామ్య స్థాయి మరింత క్షీణించి 124వ స్థానానికి పడిపోయింది. ఈ దేశం గత 16 ఏళ్లలో 6 స్థానాలు దిగజారడం గమనార్హం. రాజకీయ అస్థిరత, ఎన్నికల లోపాలు, సైనిక జోక్యం, పత్రికా స్వేచ్ఛ హరించబడటం వంటి అంశాలు పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

భారతదేశం గురించి విశ్లేషిస్తే, ఆసియా ఖండంలో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ, ప్రపంచ ర్యాంకింగ్‌లో 41వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే, ఈ నివేదిక భారతదేశాన్ని "లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల" జాబితాలో చేర్చింది. ప్రజాస్వామ్య విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయని, మీడియా స్వేచ్ఛ కొంత మేర తగ్గిందని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా 28వ స్థానంలో, ఫ్రాన్స్ 26వ స్థానంలో ఉన్నాయి. ఆసియా దేశాల్లో దక్షిణ కొరియా కూడా పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశాల జాబితా నుంచి బయటపడిపోయి, 32వ స్థానానికి పడిపోయింది.

యూరోపియన్ సెంటర్ ఫర్ పాపులిజం స్టడీస్ (ECPS) ప్రకారం.. ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు న్యాయబద్ధంగా, స్వేచ్ఛగా జరిగినప్పటికీ, మీడియా స్వేచ్ఛ లేకపోవడం, రాజకీయ ప్రత్యర్థుల అణచివేత వంటి సమస్యలు ఉంటే ఆ దేశాలను "లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలుగా" వర్గీకరిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ సంస్కృతి అభివృద్ధి చెందకపోవడం, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.

Tags:    

Similar News