మలక్ పేట వివాహిత మృతి కేసులో ఊహించని ట్విస్ట్..
దీంతో పోలీసులు వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను ఉస్మానియా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.;
హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్ హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను ఉస్మానియా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మి చిన్న కుమార్తె శిరీష (32)కు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రిన్సి అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం వీరు మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్నారు.
ఆదివారం రాత్రి శిరీష ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి, భర్త వినయ్ ఆమెను సమీపంలోని మెట్రో క్యూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఈ విషయాన్ని శిరీష కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, భౌతికకాయాన్ని స్వగ్రామం దోమలపెంటకు తరలించేందుకు వినయ్ ఏర్పాట్లు చేశాడు.
ఈ సమాచారం అందుకున్న శిరీష మేనమామ మధుకర్, వినయ్‌కు కాల్ చేసి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచాలని సూచించారు. కానీ వినయ్ ఈ మాటను పట్టించుకోకుండా అంబులెన్స్‌లో శిరీషను స్వగ్రామానికి తరలించేందుకు బయల్దేరాడు.
అసహనానికి గురైన మేనమామ మధుకర్, అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి, అతనికి ఫోన్ చేశాడు. పరిస్థితి అనుమానాస్పదంగా మారడంతో అంబులెన్స్ డ్రైవర్ ఈ విషయాన్ని చాదర్‌ఘాట్ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు.
శిరీష కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నివేదికలో ఊపిరాడకుండా హత్యచేసినట్లు తేలడంతో, వినయ్‌తో పాటు అతని ఇద్దరు అక్కలను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. శిరీషను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇది వినయ్, అతడి కుటుంబ సభ్యుల పనియేనా? దీన్ని సహజ మరణంగా ఎందుక చిత్రీకరించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని విషయాలు విచారణలో బయటపడనున్నాయి.