ప్రభుత్వం సీఎం సొంత ఆస్తా ?

ఉమ్మడి చిత్తూరు జిల్లా జీ నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ వారికి సాయం చేయవద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా వచ్చిన ప్రచారం మీద బొత్స మండలిలో ద్వజమెత్తారు.;

Update: 2025-03-03 13:30 GMT

శాసనమండలిలో వైసీపీ నాయకుడు లీడర్ ఆఫ్ అపొజిషన్ అయిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం మీద ఒక రేంజిలో నిప్పులు చెరిగారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జీ నెల్లూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ వారికి సాయం చేయవద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా వచ్చిన ప్రచారం మీద బొత్స మండలిలో ద్వజమెత్తారు.

ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ సీఎం చంద్రబాబు ఈ విధంగా ఎలా వ్యాఖ్యానిస్తారు అని ఆయన ప్రశ్నించారు. లబ్దిదారులకు రాజకీయాలు పార్టీలు ఏమిటి అని ఆయన నిలదీసారు. వారి అర్హతను గుర్తించి వారికి చేయాల్సిన సాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా తాము అయిదేళ్ళ వైసీపీ ఏలుబడిలో అందరికీ మేలు చేశామని చెప్పారు.

తమ నాయకుడు అప్పటి సీఎం వైఎస్ జగన్ అయితే ఏనాడూ ఇలా వేరే పార్టీల వారికి ఏ పనీ చేయవద్దని చెప్పలేదని అన్నారు. అందరికీ న్యాయం చేయాలని తాము తపన పడ్డామని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.

రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ అతీతంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన కోరారు. అయితే చంద్రబాబు అలా వ్యాఖ్యానించడం అంటే ప్రభుత్వం ఆయన సొంత ఆస్తా అని బొత్స హాట్ కామెంట్స్ చేశారు. ఇది పూర్తిగా మంచి విధానం కానే కాదని ఆయన అన్నారు. పార్టీలు రాజకీయాలు అన్నవి ప్రభుత్వానికి సంబంధం లేనివని అంతా ఒక్కటిగా ప్రజలను చూడాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే బొత్స ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అధికార పక్షం వైపు నుంచి గోల వినిపించింది. బొత్స వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడుతూంటే ట్రెజరీ బెంచెస్ నుంచి సెటైర్లు పడ్డాయి. అయితే బొత్స మాత్రం ఎక్కడా తమ మాటల దూకుడు ఆపకుండా ముందుకు సాగారు. మొత్తానికి చూస్తే ఆయన అసెంబ్లీలో వైసీపీ లేని లోటుని మండలిలో తీరుస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News