ఈ పరిస్థితుల్లో సవాళ్లు అవసరమా కోమటిరెడ్డి?

Update: 2015-12-26 04:57 GMT
కొంతమందికి కొన్ని రోజులు తిరుగు ఉండదు. వారేం చేసినా నడిచిపోతుంది. అలాంటప్పుడు వీలైనంత తగ్గి ఉండటమే తప్పించి మరేం చేసినా ఫలితం ఉండదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నోరు విప్పి చిక్కుల్లో పడటం కన్నా.. నోరు మూసుకొని చేయాల్సిన పనేదే కామ్ గా చేయటానికి మించిన ఉత్తమమైన పని లేదు. చూస్తుంటే.. ఈ వాస్తవం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇంకా అర్థమైనట్లు లేదు. రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెలంగాణ అధికారపక్షం మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం అనుకుంటే అది జరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో కాస్తంత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ అధికారపక్షానికి షాక్ ఇవ్వాలనుకుంటే.. చేతల్లోనే తప్పించి.. మాటలతో ఎంతమాత్రం కాదు. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తన తమ్ముడ్ని నిలిపిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన అక్కసును మనసులో దాచి పెట్టుకోలేకపోతున్నారు. అధికారపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్న ఆయన సవాళ్లు విసురుతున్నారు. రాజకీయ విమర్శలు చేయటం తప్పేం కాకున్నా.. సమయం తమకు అనుకూలంగా లేని సమయంలో లేనిపోని సవాళ్లు విసరకూడదు. ఆ విషయాన్ని మరిచిన కోమటిరెడ్డి.. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని.. ఒకవేళ అతను కానీ గెలవకుంటే.. తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసురుతున్నారు.

తమకు బలం లేకున్నా అధికారపక్షం అభ్యర్థుల్ని బరిలోకి దింపిందంటే అందులో ఏదో ప్లానింగ్ ఉంటుందని మర్చిపోకూడదు. అందులోకి కేసీఆర్ లాంటి పోల్ మేనేజ్ మెంట్ తెలిసిన వ్యక్తి అంత త్వరగా నిర్ణయం తీసుకోరు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారా? దాని వెనుక లెక్కలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ విషయాలన్నీ ఇప్పటికే పలుమార్లు నిరూపితం అయ్యాయి కూడా. అయినా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ తెలివిని తక్కువగా అంచనా వేస్తూ.. అనవసరమైన సవాళ్లు విసరటం లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవటమే తప్ప మరొకటి కాదన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న సిట్యూవేషన్ లో సవాళ్లు విసరాల్సిన అవసరం ఉందా కోమటిరెడ్డి అన్న వ్యాఖ్యను రాజకీయ వర్గాల్లో వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News