చంద్రబాబును కొణతాల ఎందుకు కలిశారు?

Update: 2015-11-21 06:10 GMT
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ  టీడీపీలో చేరేందుకు సకల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఆయన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు.  వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడిన కొణతాల కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రితో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గత శాసనమండలి ఎన్నికల సమయంలోనూ ఆయన తెదేపాలోకి రావడానికి ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబునాయుడు కూడా పచ్చజెండా ఊపారు. ఆయనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా చేర్చకోవాలని కొణతాల సూచించడంతో పెందుర్తి ఎమ్మెల్యే - మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభ్యంతరం చెప్పారు. దీంతో అప్పటికి కొణతాల చేరిక తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఆయన ముఖ్యమంత్రిని మళ్లీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో అక్కడ జిల్లా మంత్రి సీహెచ్ అన్నయ్యపాత్రుడు కూడా ఉండడం గమనార్హం.

కొణతాలను తెదేపా లోకి తెచ్చేందుకు మంత్రి అయ్యన్న కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నారు. కొణతాల వస్తే విశాఖ జిల్లాలో పార్టీకి బలమని అయ్యన్న అంటున్నారు.  మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టడానికి కూడా కొణతాల ఉపయోగపడతారన్నది అయ్యన్న ఆలోచన.  అయితే ఆయన రాకను గంటా వర్గం ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంది. తాజాగా కొణతాల ముఖ్యమంత్రితో భేటీ కావడంతో అన్ని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కొణతాల  ఏం మాట్లాడరనే విషయం బయటకు రాకున్నా తెదేపాలో చేరికపైనే ఇద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే... ఇప్పటికే ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటున్నవిశాఖ జిల్లాలో మరో సీనియర్ కొణతాల కూడా వస్తే అది బలమవుతుందా... లేదంటే విశాఖ టీడీపీలో మూడో గ్రూపు ఏర్పడుతోందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.
Tags:    

Similar News