కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ తో కొండా మంత్రాంగం.. మ‌త‌ల‌బు ఇదేనా..!

Update: 2022-05-10 06:30 GMT
కోమ‌టి రెడ్డి సోద‌రుల‌తో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా..? వారి మ‌ధ్య ముఖ్య‌మైన‌ విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయా..? భ‌విష్య‌త్తులో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయా..? వీరి భేటీ వెనుక అదృశ్య శ‌క్తి హ‌స్తం ఉందా..? అంటే కాంగ్రెస్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. కోమ‌టి రెడ్డి సోద‌రుల‌తో కొండా భేటీపై పార్టీ శ్రేణులు అనుమానాలు లేవ‌నెత్తుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రాజ‌గోపాల రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తాజాగా భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేకెత్తించింది. క్రితం ఎన్నిక‌ల్లో చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి ఓడిన కొండా అప్ప‌టి నుంచీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. త‌నకు స‌న్నిహితుడైన రేవంత్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టినా తిరిగి పార్టీలో చేర‌లేదు. మ‌రో అస‌మ్మ‌తి నేత మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డిది కూడా ఇదే ప‌రిస్థితి. త‌న‌కు సీఎల్పీ హోదా.. త‌న అన్న‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో అలిగి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇటీవ‌ల రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్న వ‌రంగ‌ల్ స‌భ‌కు కూడా డుమ్మా కొట్టారు. తాజాగా వీరిద్ద‌రూ స‌మావేశం కావ‌డం ఆస‌క్తి క‌లిగించింది. ఈ స‌మావేశంలో వీరితో పాటు రాజ‌గోపాల రెడ్డి సోద‌రుడు కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించార‌ట‌. కాంగ్రెస్ కు క్యాడ‌ర్ ఉన్నా నాయ‌క‌త్వం లేద‌ని.. బీజేపీకి లీడ‌ర్‌షిప్ ఉన్నా క్యాడ‌ర్ లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చార‌ట‌. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచ‌న‌ను వ్య‌క్తం చేశార‌ట‌.

అయితే.. వీరి భేటీపై ఈ విధ‌మైన లీకులు వ‌దిలిన‌ప్ప‌టికీ అస‌లు ఎజెండా మ‌రొక‌టి ఉంద‌ట‌. కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఇటీవ‌ల పాల‌మూరు జిల్లాలో పాద‌యాత్ర చేప‌డుతున్న బండి సంజ‌య్ ను ఏకాంతంగా క‌లిశారు. కొండా బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూపించార‌ట‌. దీనికి ఒప్పుకున్న బండి ఇత‌ర పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నాయ‌కుల‌ను కూడా పార్టీలో చేరేలా ఒప్పించ‌మ‌ని కొండాకు సూచించార‌ట‌.

దీంతో కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అదే ఎజెండాతో కోమ‌టి రెడ్డి సోద‌రుల‌ను క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులూ బీజేపీలో చేరాలా.. వ‌ద్దా అనే సంశ‌యంలో ఉన్న కొండా, రాజ‌గోపాల రెడ్డి ఈ భేటీతో స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు అయింది. అయితే వీరిద్ద‌రే కాకుండా కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డిని కూడా బీజేపీ వైపు లాగాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారట‌.

టీపీసీసీపై అసంతృప్తిగా ఉన్న ఆయ‌న కూడా ఇందుకు సానుకూల‌త వ్య‌క్తం చేశార‌ట‌. బండి సంజయ్ దూత‌గానే వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న కొండా కాంగ్రెస్ లో ఉన్న మ‌రికొంద‌రి ముఖ్య‌ నాయ‌కుల‌పై కూడా గురిపెట్టార‌ట‌. కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్న‌ట్లు ఇదే క‌నుక నిజ‌మైతే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లే. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News