కొండా గెలుపుకే గ్యారెంటీ లేదా?

Update: 2018-11-26 09:24 GMT
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర‌కాల ఒక‌టి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ అక్క‌డ బ‌రిలో ఉండ‌టమే అందుకు కార‌ణం. తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేశాక ప్ర‌క‌టించిన‌ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల తొలి జాబితాలో త‌న పేరు లేక‌పోవ‌డంతో తీవ్రంగా నొచ్చుకున్న సురేఖ పార్టీని వీడారు. సీఎం కేసీఆర్‌ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. తానేంటో చూపిస్తాన‌ని ఘీంక‌రించారు.

అనంత‌రం దిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కొండా దంప‌తులు కాంగ్రెస్‌లో చేరారు. రెండు టికెట్ల కోసం వారు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఒక కుటుంబానికి ఒక‌టే టికెట్ అన్న కాంగ్రెస్ విధానం కార‌ణంగా ఒక్క‌దానితోనే స‌రిపెట్టుకున్నారు. ప‌ట్టుబ‌ట్టి ప‌ర‌కాల టికెట్ ద‌క్కించుకున్నారు. ప‌ర‌కాల‌లో తాను గెల‌వ‌డంతోపాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ లో మ‌రో 5-6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుకు దోహ‌దం చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అప్ప‌టి నుంచి ప‌ర‌కాల‌లో సురేఖ‌ ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఆమె భ‌ర్త - ఎమ్మెల్సీ కొండా ముర‌ళి కూడా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

ప‌ర‌కాల‌లో సురేఖ‌ పై పోటీ చేస్తున్న‌ది టీఆర్ ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి. ఆయ‌న బ‌డా కాంట్రాక్ట‌ర్‌. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నం ఉన్న‌ప్ప‌టికీ.. ప‌ర‌కాల‌లో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. ఈ ద‌ఫా కూడా గెలిచి కొండా దంప‌తుల‌కు షాకివ్వాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ఐదేళ్లలో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం, దాదాపు రూ.1,200 కోట్ల విలువైన మెగా టెక్స్‌ టైల్ పార్కుకు శంకుస్థాప‌న చేయ‌డం ఆయ‌న‌కు బాగా క‌లిసొస్తున్నాయి. సురేఖ‌ను ఓడించడమే ల‌క్ష్యంగా టీఆర్ ఎస్ అధిష్ఠానం నుంచి అందుతున్న అండ‌దండ‌లు ఆయ‌న‌కు మ‌రో ప్ల‌స్ పాయింట్.

అదే స‌మ‌యంలో సురేఖ‌కు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తికూలత‌లు చాలా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉండ‌టంతో కార్య‌క‌ర్త‌లంతా చ‌ల్లా వైపుకు వెళ్లార‌ని.. ఇప్పుడు వారిని వెన‌క్కి తీసుకురావ‌డం కొండా దంప‌తుల‌కు క‌ష్ట‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ మారుతున్నార‌నే అప‌వాదు కూడా సురేఖ‌కు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టం ప‌క్క‌న పెట్టి తొలుత త‌మ విజ‌యంపై కొండా దంప‌తులు దృష్టిపెట్టాల‌ని సూచిస్తున్నారు. లేదంటే ఓట‌మి త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

   

Tags:    

Similar News