ఆసిఫాపై విద్వేష వ్యాఖ్య‌లు..బ్యాంకు ఉద్యోగిపై వేటు!

Update: 2018-04-14 08:20 GMT
జ‌మ్ము క‌శ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా రేప్ - ఉన్నావోలో ప‌ద‌హారేళ్ల ద‌ళిత బాలిక రేప్ ఘ‌ట‌న‌ల దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా క‌థువా రేప్ ఘ‌ట‌న‌పై దేశవ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు పెళ్లుబికుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ఆ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఓ ఉద్య‌మం న‌డుస్తోంది. రాధికా ఆప్టే స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు # క‌థువా...# జ‌స్టిస్ ఫ‌ర్ ఆసిఫా పేరుతో ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న తెలుపుతున్నారు. క‌థువా ఘ‌ట‌న‌లో మత‌ప‌ర‌మైన అంశాలు కూడా ముడిప‌డి ఉండ‌డంతో ఆ వ్య‌వ‌హారంలో సున్నితంగా మారింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో కొంద‌రు వ్య‌క్తులు...ఆసిఫాకు వ్యతిరేకంగా చేసిన కామెంట్ల పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఆ చిన్నారికి వ్య‌తిరేకంగా కేర‌ళ‌లో కోట‌క్ మ‌హేంద్ర బ్యాంకులో ప‌నిచేస్తున్న‌ ఓ వ్య‌క్తి చేసిన కామెంట్ పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో, ఆ వ్య‌క్తిని విధుల నుంచి తొల‌గిస్తూ బ్యాంకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

కేరళలోని కొచ్చిలో పలారివట్టోమ్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ విష్ణు నందకుమార్‌ తన ఫేస్‌ బుక్ ఖాతాలో కథువా హత్యాచార ఘటనపై మలయాళంలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ చిన్నారికి వ్య‌తిరేకంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. `ఈ వయసులో ఆమె చావడమే మంచిది. లేకపోతే పెరిగి పెద్దయ్యాక మానవ బాంబుగా మారి ఇండియాపైకి వచ్చి వందల మందిని బలితీసుకునేదేమో' అని పోస్ట్ చేశారు. ఆ పోస్టుపై నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అంతటితో ఆగ‌కుండా...నంద‌కుమార్ ప‌నిచేస్తోన్న కొటక్ మహీంద్రా బ్యాంకు బ్రాంచ్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు. వెంట‌నే నంద‌కుమార్ ను విధుల నుంచి తొల‌గించ‌క‌పోతే బ్యాంకుపై దాడి చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో, నందకుమార్ పై ఆ బ్యాంకు వేటు వేసింది. విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించ‌బోమ‌ని బ్యాంకు తెలిపింది. అయితే, నంద కుమార్ పనితీరు సరిగా లేక‌పోవ‌డంతోనే తొలగిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది. నంద‌కుమార్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని చెబుతూ అత‌డిని తొల‌గిస్తున్న‌ట్లుగా కొట‌క్ మ‌హేంద్ర ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Tags:    

Similar News