కేసీఆర్‌పై కొత్తకోట ''కొత్త'' జోస్యం..!

Update: 2015-07-06 10:26 GMT
అంతకంతకూ బలోపేతం అయిపోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం నేతలు చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగుతున్నారు. కేసీఆర్‌ను విమర్శలు చేయటానికి తమకు అవకాశం ఉన్న ప్రతివిషయం మీదా ఫోకస్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేతల్లో ఒకరైన కొత్తకోట దయాకర్‌రెడ్డి విషయానికే వస్తే.. తాజాగా ఆయన కొడంగల్‌లో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిశారు.

ఇక్కడ కొత్తకోట గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఆయన తరుచూ జోస్యాలు చెబుతుంటారు. వాటిల్లో ఎన్ని నిజం అయ్యాయన్న విషయాన్ని పక్కన పెడతే.. జోస్యాల పేరిట రాజకీయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన చెప్పిన జోస్యం ఏమిటంటే.. మరో పదకొండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పదవీ గండం ఉందని.. ఆయన తన పదవిని కోల్పోతారని చెబుతున్నారు.

దీనికి లాజిక్‌ ఏమైనా చెబుతారా? అంటే ఏమీ చెప్పని ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు కొన్ని చేశారు. కేసీఆర్‌కు పదవి పోయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని.. ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కానీ.. మరొకరు కానీ సీఎం కావటం ఖాయమని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరో చెప్పే కొత్తకోట.. అసలు కేసీఆర్‌ పదవి ఎందుకు పోతుంది? దానికి లెక్కలు ఏమిటో తర్కబద్ధంగా చెబితే బాగుంటుంది.



Tags:    

Similar News