కొత్తపల్లి గీత కుల వివాదంలో కొత్త కోణం

Update: 2016-03-11 09:41 GMT
 గత ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గమైన అరకు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత అసలు ఎస్టీయా కాదా అన్న వివాదం ఉంది. ఆమె ఎస్టీ కాదంటూ కోర్టులో కేసు నడుస్తోంది. ఆమె కులాన్ని తేల్చేందుకు గాను ఓ కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ విచారణలో భాగంగా ఎంపీ గీత సోదరుడు వివేకానంద ఎస్టీ కాదని తేలింది. దీంతో తమ్ముడు ఎస్టీ కానప్పుడు అక్క ఎస్టీ ఎలా అవుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కమిటీ తన విచారణలో తేలిన అంశాలతో విశాఖ కలెక్టరుకు నివేదిక ఇవ్వడంతో ఆయన ఎంపీ గీత వివరణ కోరారు. తాను పార్లమెంటు సమావేశాల కారణంగా బిజీగా ఉన్నానని... వివరణ ఇచ్చేందుకు తనకు అదనపు సమయం కావాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

కాగా గీత మొన్నటి ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ వంటి నేతపై అనూహ్య విజయం సాధించారు. ఉద్యోగిగా పనిచేసిన ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలో కిశోర్ పై విజయం సాధించి సంచలనం సృష్టించారు. రాష్ట్ర విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ దెబ్బతినడం ఆమెకు కిశోర్ వంటి నేతలపై గెలిచే అవకాశం కల్పించింది. అనంతరం ఆమె టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా అనర్హత వేటు పడుతుందన్న ఉద్దేశంతో ఆ పార్టీలో చేరకపోయినా టీడీపీతో కలిసి సాగుతున్నారు. ఇప్పుడు ఆమె కుల వివాదంలో చోటుచేసుకున్న ఈ మలుపు చివరకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News