ధ‌ర్మాన‌.. కాబోయే మాజీ మంత్రేనా?

Update: 2021-09-02 17:30 GMT
రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు. రాజ‌కీయ నేత‌ల ప‌దువులు కూడా అంతే. పార్టీ అధినేత అనుకోవాల‌నే కానీ ప‌ట్టుమ‌ని ఆ ప‌ద‌వులు ఊడిపోతాయి. కానీ తామే ఎక్కువ కాలం ప‌ద‌విలో ఉండాల‌ని కోరుకునే నేత‌ల‌కు ఈ విష‌యం ఓ ప‌ట్టాన అర్థం కాదు. పార్టీకి విధేయుడిగా ప‌నిచేసినా ప‌ద‌వి పోతుంద‌నే తెలీగానే అసంతృప్తి బ‌య‌ట‌ప‌డుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రైన ధ‌ర్మాన కృష్ణ దాస్ ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌లో చేప‌ట్టే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌న మంత్రి ప‌ద‌వి పోతుంద‌నే విష‌యం ధ‌ర్మాన‌కు తెలిసిన‌ట్లే ఉంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ధ‌ర్మాన కుటుంబానికి శ్రీకాకులం జిల్లాలో రాజ‌కీయ ప్రాధాన్య‌త ఉంది. అన్న ధ‌ర్మాన కృష్ణ దాస్ కంటే ముందు నుంచే త‌మ్ముడు ప్ర‌సాద‌రావు రాజ‌కీయాల్లో ఉన్నారు. చాలా కాలం పాటు తెర‌చాటునే ఉండిపోయిన కృష్ణ‌దాస్‌.. వైఎస్సార్ ఆహ్వానం మేర‌కు 2004 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి న‌ర‌స‌న్న‌పేట నుంచి గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లోనూ విజ‌య బావుటా ఎగ‌రేశారు. ఆ త‌ర్వాత వైఎస్ మ‌ర‌ణం.. త‌దిత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భావం వేళ జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచారు. దీంతో పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఈ సీనియ‌ర్ నేత‌కు జ‌గ‌న్ త‌గిన ప్రాధాన్య‌తనిస్తూ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ మంత్రిగా నియ‌మించ‌డంతో పాటు త‌న అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రిగా తీసుకున్నారు.

జ‌గ‌న్ ప‌ట్ల విధేయ‌త‌గా ఉండే ఇలాంటి సీనియ‌ర్ నేత కృష్ణ దాస్ ఇటీవ‌ల త‌మ ప్ర‌భుత్వం మీదే విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణిలో మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. జాతీయ క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా క్రీడ‌ల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం లేద‌ని ఆట‌ల కోసం పెద్ద‌గా ఖ‌ర్చు పెట్ట‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. ఎంతో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తార‌ని కృష్ణ‌దాస్‌కు పేరుంది. కానీ ఆ రోజు మాత్రం మీడియా సాక్షిగా త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టేశారు. క్రీడ‌ల ప‌ట్ల కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని గట్టిగానే మాట్లాడి కుండ బద్ధ‌లు కొట్టారు. ఆట‌ల‌కు ఖ‌ర్చు చేస్తే వైద్యానికి ఖ‌ర్చు చేయాల్సిన బాధ త‌ప్పుతుంద‌ని అన్నారు. ఆయ‌న చెప్పిన మాట‌లు నిజ‌మైన‌వే. కానీ జ‌గ‌న్ స‌న్నిహితుడైన ఆయ‌న నేరుగా సీఎంకే ఈ సూచ‌న‌లు చేయ‌కుండా ఇలా బ‌హిరంగంగా పేర్కొన‌డ‌మే చ‌ర్చ‌కు దారితీసింది.

రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులుంటాయ‌ని అధికారం చేపట్టిప్పుడే జ‌గ‌న్ చెప్పారు. దీంతో త్వ‌ర‌లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌నున్నారు. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రుల కోసం త‌న ప‌ద‌వికి జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌లుకుతున్నార‌నే విష‌యం కృష్ణ‌దాస్‌కు ముందే తెలిసింద‌ని అందుకే ఆయ‌న ఇలా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. జ‌గ‌న్ ఏం చేయ‌మ‌న్నా మంత్రి ప‌ద‌వి వ‌దులుకోమ‌న్నా కృష్ణ‌దాస్ కాదు అని చెప్ప‌లేర‌ని అంతా అంటారు. మ‌రోవైపు జిల్లాలోనూ సొంత పార్టీలో మ‌రో వ‌ర్గానికి జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇవ్వ‌బోతున్నార‌నే విష‌యం కూడా కృష్ణ దాస్ ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. త‌న‌కు క్రీడాకారుడు అన్న హోదా కంటే మ‌రేదీ ఎక్కువ కాద‌నే ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి మంత్రి ప‌ద‌వి పోయినా త‌న‌కేం ఫ‌ర్వాలేద‌ని చెప్ప‌క‌నే చెప్పారా? అనే విష‌యం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రి ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఉంటుందా? ఆయ‌న మాజీగా మారాక త‌న రాజ‌కీయాన్ని ఎలాంటి మ‌లుపు తిప్పుతారో తేలాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.




Tags:    

Similar News