రెబల్ స్టార్ వర్సెస్ చంద్రబాబు

Update: 2016-02-28 09:07 GMT
ఏపీ ప్రభుత్వంలో టీడీపీతో కలిసి సాగుతున్న బీజేపీ పూర్తిస్థాయిలో మాత్రం ఇమడలేకపోతోంది. రెండు పార్టీలూ జోడెద్దుల్లా వ్యవహరించలేకపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతల్లో వెంకయ్యనాయుడు - హరిబాబు మినహా ఎవరూ చంద్రబాబు పాలనపై సంతృప్తి కనబరచడం లేదు. అంతేకాదు.... తమను పట్టించుకోవడం లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు - కన్నా లక్ష్మీనారాయణ వంటివారైతే బహిరంగంగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన సందర్భాలున్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా చంద్రబాబు పై గుర్రుగానే ఉన్నారు. తాజాగా ఏపీ బీజేపీలో మరో సీనియర్ నేత కూడా చంద్రబాబుపై మండిపడ్డారు.

బీజేపీ కార్యకర్తలు పనిచేయకుండా  టీడీపీ అడ్డుకుంటోదని ఆయన మండిపడ్డారు. టీడీపీ చర్యలను బయటకు చెప్పుకోలేక తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. బీజేపీలోని పైస్థాయి నాయకులు మాత్రమే టీడీపీలో  కలిసి ఉండాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వెంకయ్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. కాగా ఏపీలో రెండు పార్టీల మధ్య సయోధ్య లేదని... ఈ విషయంలో అమిత్‌ షా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అయితే... వెంకయ్య నాయుడు అండగా ఉన్నంత కాలం బీజేపీలో ఎంతమంది వ్యతిరేకించినా చంద్రబాబు విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా ఏమీ చేయలేదని కృష్ణంరాజుకు ఇంకా అర్థమైనట్లుగా లేదు.
Tags:    

Similar News