రాహుల్ ప‌ప్పే..నేను రాజ‌కీయ స‌న్యాసానికి రెడీ

Update: 2018-02-07 13:43 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ద‌ఫా డైరెక్ట్‌ గా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో కేటీఆర్ మీడియాతో నేడు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్‌ గాంధీ కంటే పెద్ద పప్పు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిపించుకోలేని అసమర్థుడు రాహుల్ అన్నారు. మీ నాయకుడు పప్పు అని దేశమంతా తెలుసని.. గూగుల్‌ లో వెతికినా అదే వస్తుందని ఎద్దేవా చేశారు.

2019 అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు  మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ ఎంసీ - పాలేరు ఎన్నికల్లో - గద్వాలలో తాను చేసిన సవాల్ సవాల్‌ పై కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్‌ కు గౌరవ ప్రదమైన ఓట్లు రాలేదు. `70 సీట్లు వస్తాయని తాడు - బొంగరం లేకుండా మాట్లాడుతున్నారు. గుడారాల చాటున - కుటుంబం వెనకాల దాక్కుని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సవాల్ నుంచి తప్పించుకుంటున్నారు. 2019లోనూ ఒంటరిగా పోటీ చేస్తాం. భారీ మెజారిటీతో గెలుస్తాం.` అని ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ తీరుపై విరుచుకుప‌డ్డారు మంత్రి కేటీఆర్‌. `  హ‌త్య‌ల‌ను మా పార్టీకి అంట‌గ‌డుతున్నారు. పదవుల కోసం నరహంతుకులుగా మారిన వాళ్లు కాంగ్రెస్ నాయకులు. సీఎం పదవికోసం సొంత మనుషులను చంపిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హైదరాబాద్‌ లో 1991లో చేసిన నరమేధాన్ని మరిచిపోయి నల్గొండ హత్య గురించి మాట్లాడుతున్నారు. లోకల్‌ లో హత్య జరిగితే అదేదో రాష్ట్ర సమస్య అన్నట్లు మాట్లాడుతున్నరు` అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి స్పందిస్తున్న తీరుపై మంత్రి కేటీఆర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. కోమ‌టిరెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు తమ తలపు తట్టి వెళ్లార‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు అందడం మొదలైతే ఇంకా తమ బలం పెరుగుతుందన్నారు.

తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్  పార్టీపై మంత్రి కేటీఆర్ స్పందించారు. `ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు. పార్టీలు పెట్టుకోవచ్చు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తుంది` అంటూ లైట్ తీసుకున్నారు. జాతీయ పార్టీలు పనికిరావు అని దేశ ప్రజలు ఆలోచిస్తున్నారని ఏక‌కాలంలో కాంగ్రెస్‌ - బీజేపీకి పంచ్ వేశారు. `బీజేపీ కనీసం మిత్ర పక్షాలను కూడా మెప్పించలేకపోయింది. ఇంక ప్రజలను ఎం మెప్పిస్తుంది? కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదన్నారు. టీడీపీ - బీజేపీతో ఉందా లేదా అనేది అర్థంకాని పరిస్థితి నెలకొంది?` అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News