సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నాడు

Update: 2016-01-24 04:41 GMT
గ్రేటర్ రాజకీయం రోజురోజుకీ మరింత హాట్ గా మారుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో సాధించే సీట్ల విషయంలో పరస్పర సవాళ్లు విసురుకుంటున్న ప్రధాన రాజకీయ పార్టీల తీరుతో వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. తెలంగాణ అధికారపక్షం నేత కేటీఆర్ నోటి నుంచి ‘వంద’ సీట్ల మాటపై టీడీపీ.. కాంగ్రెస్ నేతలు సవాళ్ల మీద సవాళ్లు చేయటం.. టీఆర్ ఎస్ కానీ వంద సీట్లు సాధిస్తే.. తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరితే.. గ్రేటర్ మీద గులాబీ జెండా ఎగరకపోతే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇలా ఎవరికి వారు తమదైన వాదనను వినిపిస్తూ సవాళ్లు విసరటంతో వాతావరణం పూర్తగా వేడెక్కిపోయింది. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో వంద స్థానాలు తాము గెలుచుకుంటామని పలు సంస్థలు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయని వ్యాఖ్యానించి.. గ్రేటర్ పీఠం తమదేనని తేల్చారు. తాము కానీ గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకోవటంలో విఫలమైతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాలు విసిరారు.

కానీ.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన చేసిన వ్యాఖ్యకు కాస్తంత మసాలా యాడ్ చేసి.. గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకోవటమన్న మాటను వదిలేసి.. వంద సీట్లకు ఆయన రాజీనామాకు లింకు పెట్టటం షురూ చేశారు. దీనిపై నెలకొన్న గందరగోళానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. తాను సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తున్నానని.. గ్రేటర్ పీఠం తమదేనని.. సీట్ల గురించి తాను చెప్పటం లేదని.. గ్రేటర్ పీఠం మీద గెలుపు ఎవరదన్న విషయంపై సవాలుకు ఎవరైనా సిద్దంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. కేటీఆర్ మాటకు ఆయన ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News