కేంద్రాన్ని కేటీఆర్ ఒకటి అంటే... నెటిజన్లు 10 అన్నారే?

Update: 2022-07-29 10:30 GMT
నువ్వు ఒకటి అంటే.. నేను పది అంటాను అంటున్నారు నెటిజన్లు. ఈ కాలంలో ఒకరిపై వేలు చూపిస్తే మిగతా నాలుగువేళ్లు మనల్నే చూపిస్తాయి. ఈ విషయం రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు బాగా తెలుసు. కేంద్రం విధానాలపై కడిగేస్తున్న కేటీఆర్.. తన ప్రభుత్వంలోని లోపాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా దేశంలో బొగ్గు కొరతకు.. విద్యుత్ రేట్లు పెరగడానికి కేంద్రం కారణమంటూ కేటీఆర్ చేసిన విమర్శలకు నెటిజన్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలోని సమస్యలన్నింటిని ముందు పెట్టి.. ముందు వీటిని పరిష్కరించండి.. తర్వాత కేంద్రం సంగతి చూద్దాం అంటూ కౌంటర్లిస్తున్నారు.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నాడు?కేంద్రప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడంతో దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని.. 10 రెట్లు ఖరీదైన బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశాడు. నెక్ట్స్ టైమ్ విద్యుత్ ధరలు పెరిగినప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో మీకు తెలుసు కదా? అంటూ విమర్శించారు. ఇదే సమయంలో దేశంలో మరో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని ట్విట్టర్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

నెటిజన్ల కౌంటర్ల వెల్లువ..కేంద్రం అలసత్వం వల్లే దేశంలో బొగ్గు కొరత అని ట్వీట్ చేసిన కేటీఆర్ కు.. తెలంగాణలో సమస్యలపై అంతే వేగంగా స్పందించి పరిష్కరించవచ్చు కదా? అని చాలా మంది కౌంటర్లు ఇస్తున్నారు. 'హైదరాబాద్ రోడ్లు బాగాలేవని.. వర్షాలతో దెబ్బతిన్నాయని ముందు వాటిని రిపేర్ చేయించండి ' అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇక డ్రైనేజీల పరిస్థితి దారుణం అని.. వరద, బురదలో ఉంటున్నామని మరికొందరు కౌంటర్లు ఇచ్చారు.

ఇక తెలంగాణలో వీఆర్వోలను, వీఆర్ఏల సమస్యలు అలాగే ఉన్నాయని.. వారిని పట్టించుకున్న పాపాన పోలేదంటూ కేటీఆర్ కు వారు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపు.. ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు.. తెలంగాణలో ధరలపై నెటిజన్లు కేటీఆర్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.
Tags:    

Similar News