ఇంటే కాదు.. రచ్చ కూడా గెలిచిన కేటీఆర్

Update: 2020-02-15 04:52 GMT
మీడియా పవరేంటో కేసీఆర్, కేటీఆర్ లకు తెలుసు.. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు నాడు వైఎస్, చంద్రబాబుల పాలిటిక్స్ కు, మీడియా చేతిలో పెట్టుకొని చేసి విష ప్రచారాలకు ఎక్కువగా బలైంది కేసీఆర్, టీఆర్ఎస్సే. అందుకే గద్దెనెక్కగానే కేసీఆర్ చేసిన మొదటి పని.. మీడియాను తన గుప్పిట పట్టడం.. నాడు టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణలో నిషేధించి మీడియాకు తొలి షాక్ ఇచ్చారు. తర్వాత గళమెత్తిన అగ్ర మీడియాను తన హస్తగతం చేసుకున్నారు. మీడియా పవర్ తెలుసు కనుకే కేసీఆర్, కేటీఆర్ దానికి దూరంగా ఉంటారు. తప్పనిసరి అయితేనే మీడియా ముందుకు వస్తారు.. పార్టీ, ప్రజల, పెద్ద కార్యక్రమాల కోసం తప్పితే మీడియాలో కనిపించాలని అస్సలు అనుకోరు..

ఇక ప్రాంతీయ మీడియా తో కేసీఆర్, కేటీఆర్ లు ఇలా ఉంటే జాతీయ మీడియాకు అయితే పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఈ తండ్రీ కొడుకులు. కేటీఆర్ అప్పుడప్పుడు జాతీయ మీడియా తో మాట్లాడినా అది పెద్దగా ఫోకస్ కాలేదు.. కేసీఆర్ మాత్రం పూర్తిగా జాతీయ మీడియా కు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరి శక్తి సామర్థ్యాలు జాతీయ మీడియాకు అంతగా తెలిసే అవకాశం లేకుండా పోయింది.

అయితే ఆశ్చర్యకరంగా కేటీఆర్ తాజాగా ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మీడియా సభ సమావేశంలో అద్భుతంగా మాట్లాడేశారు. కేంద్రం విధానాలను, చర్యలను బట్టలూడదీసి నిలబెట్టారు. అత్యంత శిఖరాగ్రాన చాలా పరిపకత్వతో కేటీఆర్ దేశంలోని సమకాలీన రాజకీయాలపై అద్భతమైన అవగాహనతో ప్రశ్నలకు సమాధానాలిచ్చిన తీరు చూసి జాతీయ మీడియా, నేతలు కూడా నిజంగా ఆశ్చర్యపోయారు.

దక్షిణ భారతంలో బీజేపీ ఒక్క కర్నాటకలో మాత్రమే ఉందని.. అది కూడా అవకతవకలు చేసి గెలిచిందని.. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలోనూ అధికారం లో లేదని.. అలాంటప్పుడు వీటిని జాతీయ పార్టీలని ఎలా అంటారని కేటీఆర్ ప్రశ్నించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. బీజేపీ, కాంగ్రెస్ లను కూడా పెద్ద ప్రాంతీయపార్టీలు అనాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. ఇక పెద్దనోట్ల రద్దును మొదట సపోర్ట్ చేసింది తామేనని.. కానీ ఇప్పుడు దేశాన్ని కమ్మేసిన ఆర్థిక మాంద్యానికి పెద్దనోట్ల రద్దే కారణమని తాము చేసిన ఈ తప్పుకు చింతిస్తున్నామని కేటీఆర్ అనడం చర్చనీయాంశవమైంది.

ఇలా కేటీఆర్ ఎంతో పరిణతి చెందిన నాయకుడిలా జాతీయ రాజకీయాలపై అదరగొట్టిన తీరు జాతీయ మీడియాను మంత్రముగ్ధులను చేసిందట.. సూటు , బూట్ తొడిగి కార్పొరేట్ బాస్ లా కనిపించిన కేటీఆర్ ఆహార్యం కూడా ఒక రాజకీయ నాయకుడిని తలపించలేదంటే నమ్మండి. అసలు సిసలు నేత కేటీఆర్ అన్న ప్రశంస ఈ వేదికతో సార్థకమైందట.. చూడాలి మరి కేటీఆర్ ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో..


Tags:    

Similar News