కేటీఆర్ కు సిరిసిల్ల ఫీవ‌ర్

Update: 2016-09-14 07:52 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు - ఆ రాష్ట్ర‌  మంత్రి అయిన కేటీఆర్ కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల పేరెత్తితే జ్వ‌రం వ‌చ్చేస్తోంద‌ట‌.  క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల‌ నుంచి 2009 - 2010 - 2014ల‌లో వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన కేటీఆర్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కేసీఆర్ త‌రువాత అత్యంత కీల‌క వ్య‌క్తి.. కానీ.. ఇప్పుడాయ‌ సిరిసిల్ల పేరు చెబితే మాత్రం వ‌ణుకుతున్నార‌ట‌. సిరిసిల్లను జిల్లాను చేయాల‌న్న డిమాండ్‌ పై స్థానికులు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆయ‌న అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మొఖం చూపించ‌డానికే భ‌య‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌యంలో సిరిసిల్ల‌ను తొలుత కొత్త జిల్లాల జాబితాలో చేర్చారు.. కానీ, ఎందుకో త‌రువాత దాన్ని తొల‌గించారు.  దీంతో అస‌లే ఉద్యమాల ఖిల్లా అయిన సిరిసిల్ల‌లో అగ్గి రాజుకుంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేటీఆర్ నాయ‌క‌త్వంలో సిరిసిల్ల‌లో ఉద్య‌మాన్ని హోరెత్తించిన సొంత‌పార్టీ నేత‌లే ఆయ‌న ప్లెక్సీని త‌గ‌ల‌బెట్టేశారు. అంతేకాదు... తెలంగాణ‌లో ఎక్క‌డా లేన‌ట్లుగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ‌లు కూడా త‌గ‌ల‌బెట్టారు. సిరిసిల్ల జిల్లాగా ప్ర‌క‌టించేంత వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి రాకూడ‌దంటూ కేటీఆర్ కు  అల్టిమేటం జారీ చేశారు. ప‌రిస్థితి రోజురోజుకు ఉధృత‌మ‌వుతుండ‌టంతో అధికార పార్టీ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ముఖాలు చూపెట్టే సాహ‌సం చేయ‌డం లేదు. మా ప్రాంతాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాల్సిందేనంటూ సిరిసిల్ల మునిసిపాలిటీ కౌన్సిల‌ర్లంతా రాజీనామాలు చేశారు.

దీంతో అక్క‌డి ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్న కేటీఆర్ వారిని ఎలా బుజ్జ‌గించాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌. భౌగోళిక‌ - రాజకీయ‌ - ఆర్థిక కార‌ణాల దృష్ట్యా జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని కేసీఆర్ తేల్చేయ‌డంతో ఏం చేయాలో పాలుపోక కేటీఆర్ ఇర‌కాటంలో ప‌డ్డారు.  పార్టీ నేత‌లు కొంత త‌గ్గినా ఐకాస మాత్రం ఆందోళ‌న‌లు ఆప‌డం లేదు. జిల్లా ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు ఆందోళ‌న‌లు విర‌మించేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి ఈ స్థాయిలో వ్య‌తిరేక‌త రావ‌డంతో కేటీఆర్ తెగ ఇబ్బందిప‌డుతున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ను స‌ర్దుబాటు చేయ‌నందుకు ఇప్ప‌టికే కేసీఆర్ చీవాట్లు పెట్టిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. రాష్ట్రానికి నాయ‌కుడిగా ఎద‌గాల్సిన‌వాడివి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ఆందోళ‌న‌ల‌నే చ‌ల్లార్చ‌లేక‌పోతే ఎలా అంటూ కేసీఆర్ క్లాసు పీకిన‌ట్లు టీఆరెస్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News