చిన‌బాబు ట్వీట్ల‌తో కేటీఆర్ కు ఎంత కాలిందంటే..?

Update: 2019-03-06 04:46 GMT
డేటా చౌర్యం కేసు ఒక కొలిక్కి రాక ముందే.. ఈ అంశంపై రాజ‌కీయంగా ర‌గులుతున్న వేడి అంతా ఇంతా కాదు. నేరం జ‌రిగిన‌ట్లుగా చెప్పే ప్రాధ‌మిక ఆధారాలు ఉన్నాయా?  లేవా?  అన్నది స్ప‌ష్టం లేకుండానే జ‌రుగుతున్న హ‌డావుడిని చూస్తున్న ప‌లువురు నిపుణులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

డేటా చౌర్యం జ‌రిగింద‌న్న ఒక ఫిర్యాదుతో కూడా ఇంత ర‌చ్చ జ‌రుగుతుందా? అంటూ అవాక్కు అయ్యే ప‌రిస్థితి. డేటా చౌర్యంపై టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌ల‌కు ధీటుగా స్పందించే ప్ర‌య‌త్నంలో పెద్ద బాబు.. చిన బాబు ఇద్ద‌రూ చెల‌రేగిపోయిన వైనం తెలిసిందే. అయితే.. స‌మ‌ర్థ‌మైన వాద‌న‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించే కేటీఆర్.. తాజా ఎపిసోడ్ లోనూ అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెప్పాలి.

డేటా చౌర్యం జ‌ర‌గ‌లేదంటూ బల్ల గుద్ది చెప్ప‌లేని ఏపీ ముఖ్య‌మంత్రి ఇబ్బందిని గుర్తించిన కేటీఆర్.. త‌న‌దైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్ల‌తో కుమ్మేస్తున్నారు. టీడీపీ నాయ‌క‌త్వం ఓటుకు నోటు మాదిరే.. ట్వీటుకు నోటు స్కాంకు  పాల్ప‌డిందంటూ  మండిప‌డుతున్నారు.  తెలంగాణ ప్ర‌భుత్వం మీద బుర‌ద చ‌ల్లేందుకు కొంత‌మందికి డ‌బ్బులు చెల్లించి దొంగ ఖాతాలు సృష్టించి.. ట్విట్ట‌ర్ లో అస‌త్య ప్ర‌చారం చేయిస్తున్న‌ట్లుగా ఫైర్ అయ్యారు.

పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ స‌ర్కారు.. ప్రైవేటు కంపెనీ ఐటీ గ్రిడ్స్ కు చేర‌వేయ‌టం ద్వారా ప్రైవ‌సీ చ‌ట్టానికి తూట్లు పొడిచింద‌ని.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న‌ట్లు దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు బాబు స‌ర్కారు విమ‌ర్శ‌లు చేయ‌టం దారుణ‌మ‌న్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ఏపీ ప్ర‌జ‌ల స‌మాచారం ప్రైవేటు సంస్థ‌కు అప్ప‌గించ‌టంలో బాబు పాత్ర ప‌రోక్షంగా నిర్దార‌ణ చేస్తుంద‌న్న తీర్పును త‌న‌కు తానే ఇచ్చేసి.. బాబుకు మ‌రింత మంట పుట్టేలా చేశారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలంటూ బాబును డిమాండ్ చేసిన కేటీఆర్.. దొంగ ట్వీట్లు ఎన్నిక‌ల్లో ప‌ని చేయ‌వని.. నిజ‌మైన ఓట‌ర్లు మాత్ర‌మే ఓటు వేయాల్సిన అవ‌స‌రాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని కేటీఆర్ చెబుతున్నారు. బాబు.. ఈ ఇష్యూలో మీరు ఏ నేరం చేయ‌క‌పోతే ఈ ఉలికిపాటు ఎందుకు?  విచార‌ణ జ‌రిగితే డేటా దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే క‌దా మీ భ‌యం అంటూ కేటీఆర్ ట్వీట్ పంచ్ లు బాబు బ్యాచ్ కు మ‌హా ఇబ్బందిగా మారుతున్నాయ‌ట‌. దీనిపై తెలుగు త‌మ్ముళ్లు రుస‌రుస‌లాడుతున్నారు.

ఓవైపు కేటీఆర్ ఆ ర‌కంగా విరుచుకుప‌డుతుంటే.. మేం మాత్రం మౌనంగా.. నోరు మూసుకొని కూర్చోవాలా?  ఇదేమైనా మామూలు స‌మ‌య‌మా?  కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌లో.. ఇలా బుద‌ర జ‌ల్లుతుంటే.. మేం మాట్లాడ‌క‌పోతే.. ఇదే కేటీఆర్ ఏమంటారు. తేలు కుట్టిన దొంగ‌ల్లా కామ్ గా ఉండిపోయారు. ఇది చాలు.. వారు త‌ప్పు చేసిన‌ట్లు చెప్ప‌టానికి అంటూ రివ‌ర్స్ అయ్యేవారంటున్నారు. నిజ‌మే.. ఏం చేసినా ప‌దునైన వాద‌న‌తో విరుచుకుప‌డే కేటీఆర్ లాంటి ప్ర‌త్య‌ర్థితో బాబు లాంటోళ్ల‌కు ఇబ్బందే మ‌రి.
Tags:    

Similar News