ఈటలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చేశారా?

Update: 2019-09-04 05:48 GMT
వినాయక చవితికి కాస్త ముందుగా.. తెలంగాణ రాష్ట్రమంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ జెండాకు ఓనర్లం తామేనని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈటల నోటి నుంచి వచ్చిన మాటలపై అందరూ కామ్ గా ఉన్నా.. మంత్రి ఎర్రబెల్లి మాత్రం అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు.

టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. గులాబీ జెండా ఓనర్ కేసీఆర్ ఒక్కరేనని వ్యాఖ్య చేయటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటల లాంటి నేత మీద పుసుక్కుమని మాట్లాడే ధైర్యం ఏ గులాబీ నేతా చేయరు. కానీ.. అందుకు భిన్నంగా ఎర్రబెల్లి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల వెనుక కేటీఆర్ ఉన్నారన్న మాట వినిపించింది. దీన్లో నిజం పాళ్లు ఎంతన్న సందేహం తాజా ఉదంతంతో తేలిపోయింది.

ఎందుకంటే.. తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొంతమంది నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన.. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తు పెట్టుకోవాలన్న మాట చూస్తుంటే.. ఈటలతో వార్ ను ఓపెన్ గా డిక్లేర్ చేసినట్లేనన్న మాట వినిపిస్తోంది.

ఈటల వ్యాఖ్యలపై ఎర్రబెల్లి మినహాయించి ఎవరూ స్పందించింది లేదు. ఎర్రబెల్లి కూడా కేటీఆర్ ను కలిసేందుకు వచ్చిన వేళలోనే వ్యాఖ్యలు చేశారు. ఈటల మాటల్ని తప్పు పట్టేందుకు అధినాయకత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే ఎర్రబెల్లి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా కేటీఆర్ మాటలు ఘాటుగా ఉండటమే కాదు.. ఈటల విషయాన్ని తేల్చేందుకు వీలుగానే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.

తనకు వ్యతిరేకంగా తల ఎగిరేసిన వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కేసే అలవాటున్న కేసీఆర్.. ఈటలను మాత్రం ఎందుకు సహిస్తారన్న వాదనకు తగ్గట్లే.. తాజాగా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఏమైనా.. ఈటల విషయంలో గులాబీ పెద్ద బాస్.. చిన్న బాస్ లు క్లారిటీతోనే ఆపరేషన్ ఈటలను స్టార్ట్ చేసినట్లుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News