కాంగ్రెస్ నేత‌ల బీపీ పెంచేస్తున్న కేటీఆర్‌

Update: 2018-03-17 08:23 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేత‌లను త‌న‌దైన శైలిలో కెలుకుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి ఓపిక‌ను ప‌రీక్షించేలా కేటీఆర్ కామెంట్లు చేస్తున్నారు. ఐటీ - ప‌రిశ్ర‌మ‌లు  - చేనేత శాఖ‌ల‌తో పాటు గనులశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్  గ‌నుల శాఖ‌పై శ‌నివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా  గనులశాఖ ఆదాయ రికార్డులను పరిశీలించిన మంత్రి ఇసుక ద్వారా సమకూరిన ఆదాయంలో చోటుచేసుకున్న వ్యత్యాసాల గురించి ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో స్పందించారు. పెద్ద ఎత్తున ఆదాయం గోల్‌ మాల్ అయింద‌ని ప‌రోక్షంగా కాంగ్రెస్ నేత‌ల‌పై అవినీతి ముద్ర వేశారు.

తాజాగా ఓ ట్వీట్‌ లో కేటీఆర్ స్పందిస్తూ ``2004-14 మధ్య కాలంలో ఇసుక విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన మొత్తం ఆదాయం రూ. 39.84 కోట్లు. సగటున ఏడాదికి రూ. 4 కోట్లు. కాగా 2014-18 మధ్య కాలంలో ఇసుక విక్రయం ద్వారా వచ్చిన మొత్తం రూ. 1609 కోట్లు. సగటున ఏడాదికి రూ. 400 కోట్లు. అంటే ఇసుక విక్రయం ద్వారా జరిగిన ఆదాయ ఆర్జనలో వంద శాతం పెరుగుల నమోదైంది. ఈ తేడా నగదు మొత్తం ఎక్కడికి పోయిందో ఆశ్చర్యం కలుగుతోంది` అని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేత‌ల‌పై కామెంట్ చేశారు. కాంగ్రెస్ పాల‌న‌లో అవినీతి జ‌రిగింద‌ని...తాము పార‌ద‌ర్శ‌కంగా  వాటిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నామ‌ని కేటీఆర్ పరోక్షంగా చెప్పారు.

కాగా, గ‌నులశాఖలో అక్రమాలను ఉపేక్షించేది లేదని - మైనింగ్‌ లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదుచేయాలని అధికారులను గనులశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని గనులశాఖపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో సూచించారు. గనులశాఖలో జియోఫెన్సింగ్ - జియోట్యాగింగ్ - ఉపగ్రహ చిత్రాల ఉపయోగం - డ్రోన్ల ను వినియోగించుకోవాలని కోరారు. ఈ-వేలం ద్వారా నే గనులు - ఇసుక రీచ్‌ ల లీజు జరగాలని సూచించారు. సున్నపురాయి గనుల లీజుకు అంతర్జాతీయ స్థాయివేలం నిర్వహించాలని ఆదేశించారు.

పర్యావరణ సమతుల్యత కోసం రాక్‌ శాండ్ వినియోగాన్ని పెంచాలని - సాగునీటి ప్రాజెక్టులు - అర్ అండ్‌ బీశాఖ చేపట్టే నిర్మాణాల్లో ఉపయోగించేందుకు ఆయాశాఖల ఇంజినీరింగ్ శాఖాధిపతులతో సమావేశం ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతామని పేర్కొన్నారు. టీఎస్ ఎండీసీ సైతం రాక్‌ శాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. పలు జిల్లాల్లో చేపట్టిన శాండ్‌ ట్యాక్సీ విధానం విజయంవంతమైనందున రాష్ట్రవ్యాప్త అమలుకు సిద్ధంకావాలని చెప్పారు. ఒక్క ఫోన్‌ కాల్‌ తో రాష్ట్రంలో ఎవరికైనా ఏ ధర లో ఇసుక లభిస్తుందో తెలిసేలా విధానం ఉండాలన్నారు.

Tags:    

Similar News