నాటి స్నేహితుడ్ని యాడ్స్ తో ఇరిటేట్ చేస్తున్నారా?

Update: 2018-12-17 05:20 GMT
కోపాలు.. తాపాలు స‌హ‌జం. అందునా రాజ‌కీయాల్లో అలాంటివి మ‌రింత ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు.. అనుకోనివి జ‌రిగిపోతుంటాయి. వాటిని అలా వ‌దిలేయ‌టం మంచిది. అందుకు భిన్నంగా నా విష‌యంలోనే అలా చేస్తారా?  చూస్తా.. సంగ‌తి.. అనుకోవ‌టంతో కొత్త తిప్ప‌లు ఖాయం.  తాజాగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఆయ‌న కుమార‌ ర‌త్నం కేటీఆర్  తీరు ఇంచుమించు అదే రీతిలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ద‌న్నుగా నిలుస్తార‌ని భావించిన ద‌మ్ము మ‌నిషి.. త‌మ‌కు కాకుండా.. త‌మ వైరి వ‌ర్గంతో చెట్టాప‌ట్టాలు వేసుకొన్న వైనంపై తండ్రికొడుకులు గుర్రుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌కు మిత్రుడ‌ని భావించిన కొన్ని మీడియా సంస్థ‌లు.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ త‌మ‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింద‌న్న భావ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. నాలుగున్న‌రేళ్ల త‌మ పాల‌న‌లో కొద్ది కాలం మిన‌హా.. మిగిలిన కాల‌మంతా తాము కోరిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మీడియా సంస్థ‌లు కొన్ని.. ఎన్నిక‌ల వేళ హ‌ఠాత్తుగా ప్లేట్లు తిప్పేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న వారిలో రావ‌ట‌మే కాదు.. ఈసారి వారి విష‌యంలో ఒక చూపు చూడాల‌న్న ఆలోచ‌న‌లో తండ్రికొడుకులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇప్ప‌టికే షురూ అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఎన్నిక‌ల వేళ‌లో కొన్ని మీడియా సంస్థ‌లు చేసిన ప్ర‌చారానికి.. రాసిన రాత‌ల‌కు ఒక‌ద‌శ‌లో తాము సైతం స్థైర్యాన్ని కోల్పోయిన‌ట్లుగా కేటీఆర్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతారు. త‌మ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేసి.. త‌మ‌కున్న న‌మ్మ‌కాన్ని వ్యూహాత్మ‌కంగా దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేసిన వారిని అంత తేలిగ్గా వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌న్న పంతంలో రామ్ (కేటీఆర్) ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌ప్ప‌టి తండ్రికి స్నేహితుడే అయినా.. ఇటీవ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనుస‌రించిన వైనాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌న్న‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. అన‌వ‌స‌ర‌మైన ఆవేశం కంటే కూల్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌త్య‌ర్థుల్ని కుమ్మేయాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే రివేంజ్ షురూ అయిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో మీడియా సంస్థ‌ల్ని నిర్వ‌హించే తీరుకు.. ఇప్ప‌టికి అస్స‌లు సంబంధం లేదు. ఎవ‌రు అవున‌న్నా..కాద‌న్నా.. ఇప్పుడు మీడియాకు ఆర్థిక అవ‌స‌రాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. దీంతో.. ఆర్థిక వ‌న‌రుల మీద ఎక్కువ‌గా దృష్టి పెరిగింది. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఆర్థికంగా న‌ష్టం జ‌రుగుతుంటే ఊరుకోలేని ప‌రిస్థితి.

అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన నాటి నుంచి ఒక‌ట్రెండు మీడియా సంస్థ‌లు మిన‌హాయించి.. అంద‌రికి భారీ యాడ్స్ ఇస్తున్న కేసీఆర్ అండ్ కో.. గ‌డిచిన కొద్ది రోజులుగా జాకెట్ యాడ్స్ ఇస్తున్నారు. ఈ యాడ్స్ విలువ భారీగా ఉండ‌టం.. ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని తాము కోల్పోయామ‌న్న బాధ‌ను కొన్ని మీడియా సంస్థ‌లకు క‌లిగేలా గులాబీ బ్యాచ్ చేస్తోంది. మీడియాలో ఉండాల్సిన ద‌మ్మంతా ట‌న్నుల లెక్క‌న త‌మ ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్పుకునే మీడియా సంస్థ‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క యాడ్ కూడా ఇవ్వ‌క‌పోవ‌టం.. ఇంత భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోవ‌టం స‌ద‌రు మీడియా సంస్థ జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్లు చెబుతున్నారు. ఏదో ఒక‌ట్రెండు రోజులు జాకెట్ యాడ్స్ ఇస్తార‌నుకున్న దానికి భిన్నంగా.. నిత్యం రెండేసి పేజీలు చొప్పున యాడ్స్ ఇవ్వ‌టం ద‌మ్ము మీడియా సంస్థ‌కు ద‌డ పుట్టిస్తున్న‌ట్లు చెబుతున్నారు. నిత్యం కోట్ల‌ల్లో ఆర్థిక న‌ష్టం వాటిల్లుతున్న‌ప్పుడు ఎంత‌టి ద‌మ్ము అయినా.. కాస్త వెన‌క్కి త‌గ్గాల్సిందే.
Tags:    

Similar News