ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కు కేటీఆర్ డుమ్మా.. కారణం తెలిస్తే వావ్ అంటారు

Update: 2022-12-14 04:59 GMT
రోటీన్ రాజకీయ నాయకులకు కొదవ లేదు దేశంలో.  ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు సైతం రోటీన్ రాజకీయ నేతల మాదిరే వ్యవహరిస్తుంటారు. అందుకు భిన్నంగా కనిపించే అతి కొద్ది మంది నేతల్లో కేటీఆర్ ఒకరినిగా చెప్పాలి. అయితే.. మిగిలిన వారికి లేని సౌలభ్యం.. కేటీఆర్ కు మాత్రమే ఉన్న వెసులుబాటు కావటం.. పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి స్వయంగా ఆయన తండ్రి కావటమే. పేరుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటికీ.. పాలనతో కేటీఆర్ జోక్యం ఎంత ఉందన్నది బహిరంగ రహస్యం.

అయితే.. ఇక్కడ కేటీఆర్ ను మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే.. తనకున్న అధికారాన్ని.. అవకాశాన్ని పరిధి మించి వాడుకోవటానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఇష్యూ తన వద్దకు 'సాయం' పేరుతో అబ్లిగేషన్ రూపంలో వస్తే.. దాని కారణంగా ఇబ్బంది ఎదురవుతుందన్న విషయాన్ని ఏ మాత్రం గుర్తించినా.. నిర్మోహమాటంగా నో చెప్పేయటం.. 'పెద్ద సారు' సీరియస్ అవుతారని తేల్చేయటం కేటీఆర్ లో ఉన్న మంచి గుణంగా చెప్పాలి.

మంత్రిగా వ్యవహరిస్తూ.. మిగిలిన వారి కంటే ఎక్కువ బాధ్యతల్ని మోస్తున్న కేటీఆర్ లో ఉన్న మరో గుణం ఏమంటే.. రోటీన్ రాజకీయనాయకుడి మాదిరి వ్యవహరిస్తూనే.. చాలా సందర్భాల్లో సీఈవో మాదిరి వ్యవహరించటం ఆయనకున్న ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఎక్కడిదాకానో ఎందుకు? తాజా ఉదంతాన్నే తీసుకోండి. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెనింగ్ జరుగుతుంది. పార్టీ పరంగా చూసినా.. రాజకీయంగా చూసినా ఇది చాలా కీలకమైన అంశం. అలాంటి దాన్ని కూడా వదిలేయటం.. అది కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేందుకు వీలున్న రెండు సంస్థలతో చర్చలు జరపటం కోసం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కు గైర్హాజరు కావటం అన్నది మామూలు విషయం కాదు.

ఇప్పటికే చెప్పినట్లుగా కేటీఆర్ కున్న లక్ ఏమంటే.. ఆయన చేయాల్సిన పనులు కొన్ని చేయకున్నా.. దాన్ని సరి చేయటానికి తండ్రి రూపంలో కేసీఆర్ ఉండటం ఆయనకు లాభించే అంశం. అదే కేటీఆర్.. మరే పార్టీలో ఉండి.. ఆయన తండ్రి పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే.. ఆయనకు ఇప్పుడున్న ప్రత్యేక వెసులుబాటు ఉండేది కాదన్నది మర్చిపోకూడదు. ప్రముఖ వాహన దిగ్గజ కంపెనీ మారుతి సుజుకికి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో ఒక సమావేశం చాలాకాలం క్రితమే షెడ్యూల్ అయ్యింది.

చెప్పిన మాట మీద నిలవటం.. టైం మేనేజ్ మెంట్ విషయంలో జపాన్ కంపెనీలు ఇచ్చే ప్రాధాన్యతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడుల అంశాన్ని చర్చించేందుకు వీలుగా కేటీఆర్.. ఢిల్లీ ప్రొగ్రాంకు గైర్హాజరు కావాలని డిసైడ్ అయ్యారు.

అదే విషయాన్ని పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న తండ్రికి చెప్పి.. ఆయన వద్ద ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఫిదా కావటమే కాదు.. ఆయనపైనా గౌరవాన్ని మరింత పెంచేలా చేస్తుందని చెప్పాలి. ఏమైనా గైర్హాజరు అయి కూడా ఇమేజ్ పెంచుకునే లక్ కేటీఆర్ లాంటి కొద్ది మందికే లభిస్తుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News