పచ్చ మీడియా అంటూ కేటీఆర్ లేటెస్ట్ పంచ్

Update: 2019-04-13 05:27 GMT
చానళ్ల గొట్టాల ముందు మనసులోని మాట చెప్పటం పాత పద్దతి. ఎక్కడున్నా.. ఏమనుకున్నా.. నాలుగు ముక్కలు రాసే సౌలభ్యం నేతలకు వరంగా మారింది. గతంలో ఏదైనా చెప్పాలంటే మీడియా ముందుకు రావాలి. వస్తే.. అక్కడ తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబితే సరిపోదు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కానీ.. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత ఆ ఇబ్బంది తప్పించి. చెప్పాలనుకున్నది చెప్పేయొచ్చు. చెప్పే తీరులో తేడా వస్తే.. కాపీని మార్చుకోవచ్చు. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం.. నిపుణులు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఓకే అనుకొని వ్యూహాత్మకంగా పోస్ట్ చేయటం ఇప్పుడు నేతలంతా అనుసరిస్తున్న పద్దతి.

ఏపీలో ఎన్నికలు ముగిసి.. విజేత ఎవరన్న విషయం మీద కాస్తంత క్లారిటీ వచ్చేస్తున్న వేళ.. ఆ విషయాన్ని నేరుగా చెబుతూ తన ప్రత్యర్థులపై పంచ్ లు విసిరారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ఓడిపోతానని  చంద్రబాబు నాయుడికి అర్థమైందని.. అందుకే పచ్చ మీడియాతో కలిసి కొత్త డ్రామాలకు తెర తీశారంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చాక తెల్ల ముఖం వేయకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు షురూ చేసినట్లుగా ఎటకారం ఆడేశారు. తమ కొత్త నాటకంలో భాగంగా చంద్రబాబు.. పచ్చ మీడియా జనాల ముందు అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ నాటకాన్ని రక్తి కట్టించటానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఇవేమీ టీడీపీని కాపాడలేవంటూ ట్వీట్ పంచ్ విసిరారు.

ప్రత్యర్థులకు ఇచ్చిన ఈ ట్వీట్ షాక్ బాగుంది కానీ ఒక చిన్న అనుమానం కేటీఆర్ సారు.. ప్రత్యర్థి ఓటమి గురించి ఇంతలా ఆనందపడుతున్న మీకు.. రేపొద్దున లోక్ సభ ఎన్నికల ఫలితాలు షాకిస్తే మన పరిస్థితి ఏమిటంటారా? అయినా.. ఏపీ వార్తలే తెలంగాణలో వద్దనుకునే కేటీఆర్ కు.. ఏపీ ఎన్నికల ఫలితాల మీద అంత మక్కువ ఏమిటో?


Tags:    

Similar News