ట్ర‌బుల్ షూట‌ర్‌.. కేటీఆర్‌ కు కొత్త ఇమేజ్‌!

Update: 2017-12-21 09:47 GMT
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు అనుకున్న దాని కంటే బాగానే జ‌రిగాయి. పేరుకు తెలుగు మ‌హాస‌భ‌లే అయిన‌ప్ప‌టికీ తెలంగాణ కోణంలోనే సాగ‌టం ప‌లువురిని వేలెత్తి చూపేలా చేసింది. మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా ప్రాంతాల వారీగా తెలుగును విడ‌గొట్ట‌టంపై.. స‌భాముఖంగానే తెలంగాణ ప్ర‌ముఖుల్లో ఒక‌రైన మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. దారం తెగ‌కుండా చూసుకోవాల‌న్న మాట ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఒక సూచ‌న‌గా చెప్పక త‌ప్ప‌దు.

మ‌హాస‌భ‌ల‌కు హాజ‌రైన సంద‌ర్భంగా.. తెలంగాణ ప్ర‌భుత్వ పోక‌డ‌ల్ని గుర్తించిన విద్యాసాగ‌ర్ రావు.. కేసీఆర్ చేస్తున్న త‌ప్పును సున్నితంగా ఎత్తి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌.. మ‌హాస‌భ‌ల వేదిక మీద ఎన్టీఆర్ పేరును ఒక్క‌సారిగా కూడా త‌ల‌వ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. చివ‌ర‌కు ఆయ‌న కుమారుడు బాల‌కృష్ణ త‌న‌కు తానుగా త‌న తండ్రి గొప్ప‌త‌నాన్ని మ‌హా స‌భ‌ల వేదిక మీద నుంచి చెప్పుకోవాల్సిన దుస్థితి.

ఈ లోపాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. కొన్ని సానుకూల అంశాలు లేక‌పోలేదు. స‌భ‌ల నిర్వాహ‌ణ ద‌గ్గ‌ర నుంచి వాటిని అద్భుతంగా న‌డిపించిన క్రెడిట్ సీఎం కేసీఆర్‌ కు ద‌క్కినా.. ఈ కార్య‌క్ర‌మం మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ తో నిర్వ‌హించిన ఆయ‌న కుమార్తె క‌విత స‌మ‌ర్థ‌త తెలియాల్సిన వారికి బాగానే తెలిసింద‌ని చెప్పాలి. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి మొద‌టి నుంచి ఫాలో అప్ చేస్తున్న క‌విత‌.. చివ‌ర్లో త‌న సోద‌రుడి సాయాన్ని తీసుకోవాల్సి వ‌చ్చింది.

పేరుకు తెలుగు స‌భ‌లే అయినా.. తెలంగాణ స‌భ‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌ను తుడిపేయ‌టానికి.. విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్ప‌టానికి ట్ర‌బుల్ షూట‌ర్ గా కేటీఆర్‌ ను రంగంలోకి దించ‌టం.. ఆయ‌న త‌న పాత్ర‌ను జేమ్స్ బాండ్ తీరులో షోపించిన వైనం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.  రాత్రికి రాత్రే టాలీవుడ్ ప్ర‌ముఖుల ట‌చ్ లోకి వెళ్ల‌ట‌మే కాదు.. వారంద‌రికి ఒక వేదిక మీద‌కు తీసుకురావ‌టం విశేషంగా చెప్పాలి. క‌నిపించ‌ని రీతిలో ఉండే గ్రూపుల్ని ఒకే చోట‌కు తీసుకురావ‌టం.. దూరంగా ఉన్న వారికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హ‌జ‌రు కావాల‌న్న సందేశాన్ని వారికి అర్థ‌మ‌య్యేలా చెప్పి తీసుకురావ‌ట‌మేకాదు.. ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి వారి నోట పొగ‌డ్త‌లు వ‌చ్చేలా చేయ‌టంలో కేటీఆర్ ది కీ రోల్‌ గా చెప్ప‌క త‌ప్ప‌దు.  టాలీవుడ్ మొత్తం మ‌హాస‌భ‌ల్లో మెరుపులా మెరిసిన వేళ‌.. చిద్విలాసంగా చిరున‌వ్వులు న‌వ్వుతూ క‌నిపించిన కేటీఆర్ దాదాపుగా ఒద్దిక‌గా.. ప‌ద్ధ‌తిగా క‌నిపించి అంద‌రి మ‌న‌సుల్ని దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. అంతేనా.. ఏదైనా అవ‌స‌రం వ‌స్తే.. జేమ్స్ బాండ్ మాదిరి ఎలాంటి ట్ర‌బుల్‌ ను అయినా షూట్ చేసేస్తాన్న భ‌రోసాను చేత‌ల్లో చేసి చూపించారు. కొస‌మెరుపు ఏమిటంటే.. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌తో పెద్దోళ్లు అంటే కేసీఆర్‌ కు ఎంత గౌర‌వం.. ఎంత మ‌ర్యాద అన్న ఇమేజ్ తో పాటు.. తెలుగు భాష మీద ఉన్న ప‌ట్టు ఏమిటో తెలిస్తే.. కేటీఆర్ ట్ర‌బుల్ షూట‌ర్ గా అర్థం కావాల్సిన వారికి అర్థం కాక‌వ‌టంతో పాటు.. బోన‌స్ గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒద్దిక‌తో ఉండే కుర్రాడిగా రిజిస్ట‌ర్ అయ్యారు. కాకుంటే.. మ‌హాస‌భ‌ల విష‌యంలో తీవ్రంగా శ్ర‌మించిన క‌విత‌కే ఎలాంటి ఇమేజ్ ద‌క్క‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News