మోదీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్‌?

Update: 2017-10-22 09:14 GMT
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీఆర్ ఎస్ హ‌వా న‌డుస్తోంది. విభ‌జ‌నానంత‌రం తెలంగాణ‌లో టీఆర్ ఎస్ మ‌రింత బ‌ల‌ప‌డింది. అక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మైన ప‌రిస్థితులున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డా సీఎం కేసీఆర్‌ ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యం కొన‌సాగుతోంది. అటువంటి బ‌ల‌మైన ప్రాంతీయ‌పార్టీని ఢీకొట్టేందుకు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అప్ర‌క‌టిత ప్ర‌తిప‌క్షమైన కాంగ్రెస్ తో స‌హా టీఆర్ ఎస్ వ్య‌తిరేక పార్టీల‌న్నింటినీ క‌లుపుకొని రాబోయే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను దెబ్బ‌కొట్టాల‌ని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ ఎస్ అవ‌లీల‌గా గెలుపొందుతుంద‌ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ తో పాటు తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ ఇంగ్లిషు చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని సీఎం కేసీఆర్ సంద‌ర్భానుసారంగా విమ‌ర్శిస్తుంటారు. మోదీ నోట్ల‌ర‌ద్దు నిర్ణ‌యాన్ని తొలుత వ్య‌తిరేకించిన కేసీఆర్ - ఆ త‌ర్వాత దానికి మ‌ద్ద‌తు తెలిపారు. తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన  బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత బీజేపీ బ‌ల‌ప‌రిచిన‌ రాష్ట్రప‌తి - ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో, టీఆర్ ఎస్‌...బీజేపీ కి అనుకూలంగా ఉందో....వ్య‌తిరేకంగా ఉందో అర్థం కాని ప‌రిస్థితి ఉంది. అయితే, తాజాగా ఆ విష‌యంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ లేదా కాంగ్రెస్  తో పొత్తు పెట్టుకోవ‌డం లేద‌ని చెప్పారు. పొత్తులు త‌మ‌కు క‌లిసిరాలేద‌ని చెప్పారు.  ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌న్నారు.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్వాన్న ప‌రిస్థితుల్లో ఉంద‌ని, ఆ పార్టీ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితులు లేవ‌ని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ సొంత‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం లేద‌ని, దాదాపుగా సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కేవ‌లం గుజ‌రాత్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తే చాల‌ద‌ని, దేశంలోని మిగతా ప్రాంతాల‌పై కూడా ఫోక‌స్ చేయాల‌ని కేటీఆర్ మోదీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  దేశం మొత్తం మీద  ప్రాంతీయ‌పార్టీల‌దే హవా అని చెప్పారు. మ‌రి కేటీఆర్ కామెంట్ల‌పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News