అలా చేస్తే కేటీఆర్ మ‌న‌సు దోచుకోవ‌టం ప‌క్కా!

Update: 2019-01-04 05:34 GMT
ఎన్నిక‌ల‌య్యాయి. ఫ‌లితాలు వ‌చ్చాయి. ప‌వ‌ర్ ఎవ‌రిదో తేలింది. టీఆర్ఎస్ తొలి ప్ర‌భుత్వంలో అన్నీ తానైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే దారుల‌న్నీ మూసేశారు. పార్టీ.. ప్ర‌భుత్వం ఏదైనా స‌రే మ‌రో చెక్ పాయింట్ పెట్టేశారు. ఆ పాయింట్ కేటీఆర్‌. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా త‌న కుమారుడు అలియాస్ కేటీఆర్‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను క‌ట్ట‌బెట్ట‌టం ద్వారా త‌న త‌ర్వాత ఎవ‌ర‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

పెద్ద సారును క‌లిసే అవ‌కాశం లేన‌ప్పుడు దిక్కు చిన్నసారే. అందులోకి పెద్ద‌సారును క‌లిసే అవ‌కాశం లేన‌ప్పుడు అంద‌రి దృష్టి చిన్న‌సారు మీద‌నే ప‌డేది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో అలాంటి ప‌రిస్థితి. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేని త‌ర‌హాలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత కూడా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌క‌పోవ‌టం.. ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌క‌పోవ‌టంతో అంద‌రికి కేటీఆరే కేంద్ర‌బిందువు అయ్యారు.

తన‌కు తానుగా ఎంపిక చేసుకున్న కొన్ని కార్య‌క్ర‌మాలు మిన‌హా.. మిగిలిన అన్నింటిలోనూ కేటీఆరే క‌నిపిస్తున్న ప‌రిస్థితి. పార్టీ ప‌గ్గాలు చేత‌బ‌ట్టిన నాటి నుంచి కేటీఆర్ మ‌రింత స్పీడ్ అయ్యారు. ఏ విష‌యాల్ని విడిచి పెట్ట‌కుండా ఆయ‌న అన్నింటిలోనూ త‌న ముద్ర ప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో.. అంద‌రికి కేటీఆరే దిక్కు అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో కేటీఆర్ మ‌న‌సును దోచుకోవ‌టానికి.. ఆయ‌నకు ద‌గ్గ‌ర కావ‌టానికి ఎవ‌రికి వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు.

గ‌తంలో ఆయ‌న ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసిన వారు వాటిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. అప్ప‌ట్లో అంత ద‌గ్గ‌ర‌గా లేని వారు ఇప్పుడు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా వ‌చ్చిన పంచాయితీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేటీఆర్ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. పంచాయితీ ఎన్నిక‌లు ఎలా జ‌ర‌గాల‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఎన్నిక‌ల్లో పోటాపోటీ ప‌డ‌టం లాంటివి వ‌ద్ద‌ని.. ఏక‌గ్రీవాల‌కే మొగ్గు చూపాల‌న్న విష‌యాన్ని ఆయ‌న ఓపెన్ గా చెప్పేశారు.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాట్లాడిన ఆయ‌న బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఏక‌గ్రీవ‌మైన గ్రామ పంచాయితీల‌కు ప్ర‌భుత్వం అందించే రూ.10 ల‌క్ష‌ల‌తో పాటు.. సొంతంగా త‌న ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి మ‌రో రూ.15 ల‌క్ష‌లు ఇచ్చి ప్రోత్స‌హిస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. ఇక్క‌డ కేటీఆర్ సాబ్ ఇచ్చే డ‌బ్బుల కంటే కూడా.. ఆయ‌న కంట్లో ప‌డ‌టం.. ఆయ‌న మ‌న‌సు దోచుకోవ‌ట‌మే అస‌లు విష‌యం. కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఒక్క సిరిసిల్లా మాత్ర‌మే కాదు.. మిగిలిన జిల్లాల్లోని టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు ఏక‌గ్రీవం అయ్యేలా చేసి.. త‌మ స‌త్తాను చాటేలా ప్లాన్ చేసుకునే దిశ‌గా కేటీఆర్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

జిల్లాల్లో జ‌రిగే పంచాయితీ ఎన్నిక‌ల్లో అత్య‌ధికం ఏక‌గ్రీవాలు చేయ‌టం ద్వారా నేత‌లు త‌మ స‌త్తాను చాటే అవ‌కాశాన్ని ఇవ్వ‌టం కేటీఆర్ మాట‌ల్లో ముఖ్య‌మైన పాయింట్ అయితే.. మ‌రోవైపు ఏక‌గ్రీవం ద్వారా తెలంగాణ‌లో త‌మ పార్టీ నేత‌ల‌కు తిరుగులేద‌న్న సందేశాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఇవ్వ‌టం ద్వారా లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి ఆ పార్టీల‌ను మ‌రింత నీర‌స‌ప‌డేలా చేయాల‌న్న వ్యూహం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Full View

Tags:    

Similar News