కేటీఆర్ నెటిజ‌న్లకు దొరికిపోయాడు

Update: 2018-09-03 17:59 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టివ్‌గా ఉండే సంగ‌తి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా త‌న అనుచ‌రుల‌ను, వివిధ వ‌ర్గాల వారిని ఆయ‌న చేరువ అవుతున్నారు. స‌ర‌దా అంశంపై స్పందించ‌డం అయినా...స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేయ‌డ‌మైనా...ట్విట్ట‌ర్ వేదిక‌గానే కేటీఆర్ కానిచ్చేస్తుంటారు. ఇలా ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన మంత్రి కేటీఆర్ అదే ట్విట్ట‌ర్ వేదిక‌గా బుక్ అయిపోయారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ వేదికగా జరిగిన సభ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆయ‌న‌కు బూమ‌రాంగ్ అయింది.

గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివ‌రించేందుకు తెలంగాణలో అధికారపీఠంపై ఉన్న టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’ పేరుతో నిర్వహించిన సభ విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. సర్కారు ఈ సభావేదిక నుంచి ప్రజానీకానికి నివేదించారు. తాము టార్గెట్ పెట్టుకున్న ప్రకారం సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ప్రగతి నివేదన సభను అడ్డుకోవాలంటూ ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లడం చర్చనీయంగా మారింది. అయితే పర్యావరణానికి ఇబ్బందిలేకుంటా చూసుకుంటామని కోర్టుకు తెలపడంతో... ఆ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు... పర్యావరణానికి ఇబ్బంది లేకుండా సభ నిర్వహించుకోవాలని సూచించింది. లక్షలాది మంది తరలిరావడంతో సభా స్థలాలో చెత్త పేరుకుపోయింది... సభ ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం... వాలంటీర్లు ఆ ప్రాంతాన్ని క్లీన్ చేశారు.

కాగా, హైకోర్టులో హామీ ఇచ్చినట్టుగా ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో మా పార్టీ వాలంటీర్లు, కార్మికులు శుభ్రం చేశారంటూ... సభా స్థలిని క్లీన్ చేస్తున్న ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, దీనిపై నెటిజ‌న్లు ఆయ‌న్ను ట్రోల్ చేశారు. అనేకమంది టీఆర్ఎస్ నాయ‌కులు తాగుతూ వాహ‌నాల్లో ఉండ‌టం, పైగా రోడ్డుపై విచ్చ‌ల‌విడిగా ఫ్లెక్సీలు వేయ‌డం వంటి వాటిపై కూడా కేటీఆర్ స్పందించాల‌ని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News