నా జీవితం నా ఇష్టం అంటున్న కేటీఆర్‌

Update: 2018-02-11 17:31 GMT
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటార‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ప్ర‌తి అంశంపై ఆయ‌న స్పందిస్తుంటారు. రాష్ట్రంలో కానీ - దేశ - విదేశాల్లో ఎక్కడికి పోయినా తను చేస్తున్న ప్రతి పనిని ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియబరుస్తున్నారు. రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు - అభివృద్ధి పనులను ట్విట్టర్‌ లో పోస్టు చేస్తూ.. ప్రభుత్వ పనితీరును తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ట్విట్టర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.  ట్విట్టర్‌ లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తనను ఫాలో అవుతున్న నెటిజన్లందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు.

అయితే ఇంత చురుకుగా ఉండే కేటీఆర్‌కు త‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల చికాకేసిన‌ట్లుంది. అందుకే ఆయ‌న ఘౄటుగా స్పందించారు. అస‌లింత‌కి ఏం జ‌రిగిందంటే...మంత్రిగా ఆయన తన కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడూ సినిమాలకు సంబంధించి తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. శనివారం రాత్రి ఆయన తొలిప్రేమ సినిమా చూశానని ట్వీటర్‌ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.

ఇది కొందరు నెటిజన్లకు నచ్చలేదు. ఆ తరువాత కేటీఆర్‌ ట్విటర్‌ లో తన ప్రొఫైల్‌ ఫొటోను మార్చుకున్నారు. నెటిజన్లు దీన్ని కూడా తప్పుబడుతున్నారు. దీనిపై ఆదివారం ట్విట్టర్ లో స్పందించారు కేటీఆర్.

తన ట్వీట్లపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు కేటీఆర్ దీటుగా సమాధానమిచ్చారు . ‘నేను సినిమాలు చూస్తున్నానని, ప్రొఫైల్‌ పిక్చర్‌ లు మారుస్తున్నానని ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏదన్నా పనిచేసుకోండి. నేను మంత్రినే అయినా నాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. మీకు నచ్చకపోతే నిరభ్యంతరంగా నన్ను ట్విటర్లో అన్‌ ఫాలో అవ్వచ్చు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. త‌ద్వారా త‌న పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పోస్టులపై నెటిజన్ల కామెంట్లు అవ‌స‌రం లేద‌ని తేల్చేశారు.
Tags:    

Similar News