ప్ర‌వాసులు.. ప్ర‌ముఖుల‌తో కేటీఆర్ బిజీబిజీ

Update: 2015-05-07 09:15 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమారుడు.. తెలంగాణ‌రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు అమెరికా ఏమీ కొత్త‌కాదు.అక్క‌డే చ‌దువుకొని.. అక్క‌డే ఉద్యోగం చేసిన ఆయ‌న‌.. తెలంగాణ ఉద్య‌మంలో త‌న వంతు సాయం అందించేందుకు.. ఉద్యోగాన్ని వ‌దిలి ఉద్య‌మంలోకి వ‌చ్చి..అంచ‌లెంచ‌లుగా ఎదిగి..ఇప్పుడు మంత్రిహోదాలో ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న చేస్తున్నారు.

కాక‌పోతే.. అమెరికాలో ఉద్యోగం వ‌దిలేసి.. హైద‌రాబాద్‌కు వ‌చ్చేసిన ఆయ‌న‌.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ అమెరికాలో అడుగుపెట్టారు. ఈసారి ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న ఆద్యంతం వ్యూహాత్మ‌క‌మే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నేతృత్వం వ‌హిస్తూ ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత బ‌లంగా అమెరికాలో నాట‌టంతో పాటు.. తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌వాస భార‌తీయులు.. మ‌రి ముఖ్యంగా తెలంగాణ‌వాదుల స‌హ‌కారాన్ని అందుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే.. అమెరికాలో స్థిర‌ప‌డ్డ తెలంగాణ‌వాదులు కేటీఆర్‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్‌కాక‌తీయ‌కు త‌మ వంతు సాయంగా 50వేల డాల‌ర్ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. కేటీఆర్ తాజా ప‌ర్య‌ట‌న‌కు ఎన్నారై టీఆర్ ఎస్ విభాగంతో పాటు.. తెలంగాణ ప్ర‌జ‌లు.. కేటీఆర్ స్నేహితులు భారీగా ఆయ‌న‌ను క‌లుస్తున్నారు.త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డీసీలో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. అనంత‌రం పిట్స్ బ‌ర్గ్‌కు వెళ్లారు. అక్క‌డ ప‌లువురు ప్ర‌ముఖులతో భేటీ అయ్యారు.

తాజాగా డ‌ల్లాస్ వెళ్లిన ఆయ‌న అక్క‌డ ప‌లువురు వ్యాపార ప్ర‌ముఖుల్ని క‌ల‌వ‌నున్నారు. రానున్న రోజుల్లో ఆయ‌న ప‌లువురు ప్ర‌ముఖ‌ల్ని క‌లుసుకోనున్నారు. తెలంగాణ‌కు పెట్టుబ‌డుల సాధ‌న‌తో పాటు.. తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని వివ‌రించ‌టం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి టీఆర్ ఎస్ స‌ర్కారు ఎంత క‌మిట్ మెంట్‌తో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యాన్ని చాటి చెప్పే ప్ర‌య‌త్నంలో ఆయ‌న బిజీబిజీగా ఉంటున్నారు.
Tags:    

Similar News