కిష‌న్ రెడ్డి గాలి తీసిన కేటీఆర్

Update: 2017-11-07 08:41 GMT
ప‌బ్లిక్‌.. ప్రైవేట్ రెండు వేర్వేరు. ఇది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ.. తెలంగాణ అధికార‌ప‌క్షం టీఆర్ఎస్‌కు మాత్రం ఈ రెండింటికి తేడా తెలీన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో త‌మ‌తో ప్రైవేటుగా మాట్లాడిన మాట‌ల్ని సైతం బ‌య‌ట‌కు చెప్పేసి ఇరుకున ప‌డేయ‌టం కేసీఆర్ అండ్ కోకు బాగా అల‌వాటు. ఆ మాట‌కు వ‌స్తే.. ఈ చిత్ర‌మైన అల‌వాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిగ్నేచ‌ర్ స్టైల్‌.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న‌తో ఏమైనా మాట్లాడినా.. ఏదైనా ప్ర‌స్తావ‌న తెచ్చిన ఆ విష‌యాన్ని ప‌బ్లిక్ గా చెప్పేస్తుంటారు. అలా అని ఎవ‌రైనా త‌న మాదిరే చేస్తే మాత్రం అస్స‌లు త‌ట్టుకోలేరు. తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకోవాల‌ని నిత్యం త‌పించే కేటీఆర్ తాజాగా త‌న తండ్రి బాట‌లో న‌డిచార‌ని చెప్పాలి.

బీజేపీ ఎమ్మెల్యే  కిష‌న్ రెడ్డికి సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర అంశాన్ని బ‌య‌ట‌పెట్టిన మంత్రి కేటీఆర్ ఆయ‌న గాలి తీసే ప్ర‌య‌త్నం చేయ‌టం గ‌మ‌నార్హం. ఈ రోజు ఉద‌యం కిష‌న్ రెడ్డి త‌న‌కు ఫోన్ చేశార‌ని.. ఇవాళ మా తాగునీటి కొర‌త క్వ‌శ్చ‌న్‌ను వాయిదా వేసుకుంటున్న‌ట్లుగా చెప్పార‌ని.. దీంతో కిష‌న్ రెడ్డి స‌భ‌కు రావ‌టం లేద‌ని అనుకున్నాన‌ని.. కానీ సభ‌కు వ‌చ్చార‌న్నారు.

మొద‌టి ప్ర‌శ్న కిష‌న్ రెడ్డిదే అయిన‌ప్ప‌టికీ దాని మీద మాట్లాడ‌కుండా.. వాయిదా వేసుకొని మ‌రీ ఇలా గోల చేయ‌టం ఏమిటంటూ సూటిగా ప్ర‌శ్నించ‌టంతో కిష‌న్ రెడ్డి గాలి తీసిన‌ట్లైంది.  ముఖ్య‌మైన ప్ర‌శ్నను స‌భ‌కు ఇచ్చి.. మాట్లాడ‌కుండా స‌భ‌లో చ‌ర్చ‌కు రాకుండా ర‌చ్చ‌కు రావ‌టం ఏ విధ‌మైన నీతి అంటూ బీజేపీ ఎమ్మెల్యేల తీరును ప్ర‌శ్నించారు. సిటీలో నీటి స‌మ‌స్య లేక‌పోవ‌టం వ‌ల్లే ఏం అడ‌గాలో అర్థం కాక‌.. ధైర్యం లేక‌నే ప్ర‌శ్న‌ను వాయిదా వేసిన‌ట్లుగా క‌డిగేశారు. తాను ప‌ర్స‌న‌ల్ గా ఫోన్ చేసిన విష‌యాన్ని కేటీఆర్ ఓపెన్ గా చెప్పేయ‌టం.. త‌న‌ను ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించిన కేటీఆర్ తీరుతో కిష‌న్ రెడ్డి అవాక్కు అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News