అత‌నికి కుకునూరుప‌ల్లి ఎస్ ఐ చివ‌రి కాల్‌!

Update: 2017-07-04 04:59 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించాయి బ్యూటీషియ‌న్ శిరీష‌.. కుకునూరుప‌ల్లి ఎస్ ఐ మ‌ర‌ణాలు. రెండు వేర్వేరుచోట్ల చోటు చేసుకున్న ఈ మ‌ర‌ణాల‌కు లింకు ఉండ‌టంతో ఇదో క్రైం థ్రిల్ల‌ర్ మూవీని మ‌రిపించే మారింది. అంత‌కంత‌కూ పెరిగిన ట్విస్టుల‌తో గ‌డిచిన కొద్ది రోజులుగా ఈరెండు మ‌ర‌ణాలు రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. ఈ రెండు మ‌ర‌ణాల‌పై వారి వారి కుటుంబ స‌భ్యులు హ‌త్య‌లుగా పేర్కొంటున్న‌ప్ప‌టికీ.. పోలీసులు మాత్రం ఇద్ద‌రివి ఆత్మ‌హ‌త్య‌లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కుకునూరుప‌ల్లి ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి కొన్ని కీల‌క అంశాల్ని తెర మీద‌కు వ‌చ్చారు. ఎస్ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ర‌ణంపై వెల్లువెత్తుతున్న సందేహాల నేప‌థ్యంలో ఈ విచార‌ణ‌ను స‌మ‌గ్రంగా నిర్వ‌హించాల‌ని అత్యున్న‌త స్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో.. ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ర‌ణంపై మ‌రింత లోతుగా విచార‌ణ మొద‌లైంది. తాజాగా కొత్త విష‌యాలు కొన్ని వెల్ల‌డ‌య్యాయి.

పై అధికారుల వేధింపుల వ‌ల్లే కుకునూరుప‌ల్లి ఎస్ ఐ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా చేస్తున్న వాద‌న‌ల్లో నిజం లేద‌న్న‌ట్లుగా అధికారుల ద‌ర్యాప్తు వివ‌రాలు ఉన్నాయి. ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ర‌ణానికి మూడు రోజుల ముందు నుంచి ఏం జ‌రిగింద‌న్న విష‌యం మీద పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ తాను సూసైడ్ చేసుకునే ముందు త‌న బ్యాచ్ మేట్ అయిన ఒక స్నేహితుడికి ఫోన్ చేసిన‌ట్లు గుర్తించారు.

స‌ద‌రు స్నేహితుడ్ని క‌లిసిన అధికారులు.. జ‌రిగిందేమిట‌న్న‌ది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌భాక‌ర్ రెడ్డి స్నేహితుడు అందించిన స‌మాచారం ప్ర‌కారం.. మ‌ర‌ణానికి ముందు ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన చివ‌రి కాల్ స‌ద‌రు స్నేహితుడిదేన‌ని అధికారులు గుర్తించారు. ఆయ‌న్ను పిలిపించి మాట్లాడిన‌ప్పుడు.. మ‌ర‌ణించ‌టానికి కొద్దిసేప‌టి ముందు.. ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌కు ఫోన్ చేశార‌ని.. త‌న‌కు భ‌యంగా ఉంద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని ఉంద‌ని చెప్పిన‌ట్లుగా స‌ద‌రు ఎస్ ఐ అధికారుల‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు వ‌ద్ద‌ని.. తాను వ‌స్తున్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. హ‌డావుడిగా తాను ప్ర‌భాక‌ర్ రెడ్డి కార్వ‌ర్ట్స్ కు బ‌య‌లుదేరాన‌ని.. ఇంటి లోప‌ల‌కు ప్ర‌వేశించే స‌మ‌యంలోనే ట‌ప్ అంటూ రివాల్వ‌ర్  పేలిన‌ శ‌బ్దం వినిపించింద‌ని.. లోప‌ల‌కు వెళ్లి తాను చూసేస‌రికి ప్ర‌భాక‌ర్ రెడ్డి ర‌క్తం మ‌డుగులో ఉన్న‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

త‌న‌ను తాను కాల్చుకొని చ‌నిపోయిన ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ర‌ణంపై ప‌లు సందేహాలు ఉన్నాయి. అన్నింటికి మించి.. ప్ర‌భాక‌ర్ రెడ్డి కుర్చీలో కూర్చొని త‌న‌ను తానుకాల్చుకున్న తీరుపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌ను తాను కాల్చుకునే వేళ‌లో.. క‌ణ‌తలో కాల్చుకున్న వేళ రివాల్వ‌ర్‌ను కొంత కింద‌కు వంచి ట్రిగ్గ‌ర్ నొక్కార‌ని.. దీంతో బుల్లెట్ త‌ల వెనుక వైపు నుంచి బ‌య‌ట‌కు వెళ్లింద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే వెనుక ఉన్న గోడ‌కు త‌గిలి మ‌రో మ‌లుపు తీసుకుంద‌ని.. త‌ల వెనుక నుంచి బుల్లెట్ రావ‌టంతో పెద్ద‌గా రంధ్రం ఏర్ప‌డి.. అటు నుంచే మాంసం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్ప‌ష్టం చేసింద‌ని చెబుతున్నారు. ఇక‌.. పిస్ట‌ల్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని ఉండ‌టంతో చేతిలోనే ఉండిపోయింద‌ని.. చేయి కింద‌కు వాలిన స‌మ‌యంలో జారి మ‌డ‌మ వ‌ద్ద ప‌డి పోయింద‌ని భావిస్తున్నారు.

కాల్చుకున్న‌ప్పుడు క‌చ్ఛితంగా కింద ప‌డిపోవాల‌ని ఏమీ లేద‌ని.. కూర్చునే విధానం.. రివాల్వ‌ర్ పేలిన‌ప్పుడు వ‌చ్చే వేగాన్ని ఆధారంగా చేసుకొని ప‌డిపోవ‌టం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెబుతున్నారు. రాజీవ్‌..శ్ర‌వ‌ణ్‌.. శిరీష‌లు ప్ర‌యాణించిన కారు జూన్ 12 రాత్రి 11.20 గంట‌ల‌కు క్వార్ట‌ర్స్ లోప‌ల‌కు వెళ్లి.. అర్థ‌రాత్రి 2.10 గంట‌ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా సీసీ టీవీ ఫుటేజ్ స్ప‌ష్టం చేస్తుంద‌ని చెబుతున్నారు. మొత్తంగా ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డిది నూటికి నూరుపాళ్లు ఆత్మ‌హ‌త్యే అన్న రీతిలో పోలీసులు ఆధారాలు రెఢీ చేయ‌టం క‌నిపిస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News