బాహుబ‌లిని వ‌దిలిపెట్ట‌ని ఉత్త‌రాది నేత‌లు

Update: 2018-01-06 04:40 GMT
టాలీవుడ్ ఇమేజ్‌ ను అమాంతం పెంచేసిన మూవీగా బాహుబ‌లిని చెప్పాల్సిందే. తెలుగుసినిమా ఇండ‌స్ట్రీ ఇమేజ్ ను లెక్కించే వేళ‌లో బాహుబ‌లికి ముందు.. త‌ర్వాత అంటూ లెక్కించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. సినిమా విడుద‌లైన ఇన్నాళ్ల‌కు.. అవ‌స‌రానికి అనుగుణంగా బాహుబ‌లి పేరును ఉత్త‌రాది రాజ‌కీయ నేత‌లు వాడేయ‌టం క‌నిపిస్తోంది.

తాజాగా ఢిల్లీ అధికార‌ప‌క్ష‌మైన ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్‌.. సొంత పార్టీ అధినేత‌పై త‌ర‌చూ నిప్పులు చెరిగే  అల‌వాటున్న నేత కుమార్ విశ్వాస్ త‌న‌ను తాను బాహుబ‌లిగా పోల్చుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఆప్ ప్ర‌భుత్వాన్ని దెబ్బ తీయ‌టానికి కుమార్ విశ్వాస్ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ గోపాల్  రాయ్ త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల్ని తిప్పి కొట్టే ప్ర‌య‌త్నంలో ఆయ‌న బాహుబ‌లి ప్ర‌స్తావ‌న చేశారు. త‌న‌ను తాను బాహుబ‌లితో పోల్చుకున్న ఆయ‌న‌.. మున్సిప‌ల్ ఎన్నికలు జ‌రిగిన ఏడు నెల‌ల త‌ర్వాత గోపాల్ రాయ్ నిద్ర లేచిన‌ట్లుగా త‌ప్పు ప‌ట్టారు.

ఆప్ పార్టీని మ‌హిష్మ‌తి సామ్రాజ్యంగా అభివ‌ర్ణించిన కుమార్ విశ్వాస్‌.. వేరొక‌రు శివ‌గామిగా రాజ్యాన్నిపాలిస్తున్నారు.. ఈ బాహుబ‌లిని చంప‌టానికి రోజుకో క‌ట్ట‌ప్ప పుట్టుకొస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. త‌న లాంటి నేత‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌క‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

దీనికి గోపాల్ స్పందిస్తూ.. నిత్యం పార్టీపై విమ‌ర్శ‌లు చేసే కుమార్ లాంటి నేత‌కు రాజ్య‌స‌భ స్థానం ఎలా ఇవ్వ‌గ‌లుగుతామ‌ని ప్ర‌శ్నించారు. మిగిలిన రాజ‌కీయం ఎలా ఉన్నా.. బ‌హుబ‌లి మూవీని ఇప్ప‌టికి మ‌ర్చిపోలేద‌న‌టానికి ఢిల్లీ నేత వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News