కొడుకు మెజార్టీని స‌గానికి త‌గ్గించిన సీఎం!

Update: 2019-05-05 11:28 GMT
ఎన్నిక‌ల ప్రాసెస్ ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. ఓట‌రు నాడి ఏమిటో ఇట్టే అర్థం కాక మాన‌దు. కాకుంటే.. ఆ ప్ర‌క్రియ‌లో ప‌క్ష‌పాతం.. ఒక‌వైపు వంగిపోకుండా.. సాపేక్షంగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. తాజాగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న దానిపై ఎవ‌రికి వారు వారికి త‌గ్గ‌ట్లుగా విశ్లేష‌ణ‌లు చేస్తుంటారు. ఏ నేత కూడా తమ ఓట‌మిని ఒక ప‌ట్టాన ఒప్పుకోరు.

ఎన్నిక‌ల బ‌రిలో నిలుచున్న ప్ర‌తి ఒక్క‌రు గెలుపు మీద ధీమాను వ్య‌క్తం చేస్తుంటారు. ఓట‌మి ఖాయ‌మ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతున్నా.. అదేమీ లేద‌న్న‌ట్లుగా వాదించే తీరు క‌నిపిస్తూ ఉంటుంది. ఎక్క‌డిదాకానో ఎందుకు?  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునే తీసుకోండి. ఏపీలో ఆయ‌న‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న‌ట్లుగా ప‌లువురు చెబుతున్నా.. ఆయ‌న మాత్రం గెలుపు ఖాయ‌మ‌ని చెబుతారు. 2వేల శాతం తాము గెలుస్తున్నామ‌ని వ్యాఖ్యానిస్తారు.

ఇంత‌లా ధీమా వ్య‌క్తం చేసే వేళ‌.. ఒక ముఖ్య‌మంత్రి త‌న కొడుక్కి వ‌చ్చే మెజార్టీని మొద‌ట చెప్పిన దానికి భిన్నంగా స‌గం మెజార్టీ మాత్ర‌మే వ‌స్తుంద‌ని చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. క‌ర్ణాట‌క రాజ‌కీయాల మీద అవగాహ‌న ఉన్న వారు.. అక్క‌డి మండ్య ఎంపీ స్థానం మీద ప్ర‌త్యేక ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

ఆ స్థానం నుంచి క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. అత‌డిపై పోటీకి దివంగ‌త ప్ర‌ముఖ న‌టుడు.. రాజ‌కీయ నేత అంబ‌రీశ్ స‌తీమ‌ణి సుమ‌ల‌త బ‌రిలో నిలిచారు. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా ఉన్న‌ప్ప‌టికి ఆమెకు బీజేపీ మ‌ద్ద‌తు ప‌లికింది. అదే స‌మ‌యంలో సుమ‌ల‌త‌ను ఉద్దేశించి జేడీఎస్ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు ఆమెపై సానుభూతిని పెంచేలా చేశాయి. అవ‌స‌రానికి మించిన అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించిన కార‌ణంగా నిఖిల్ ఓట‌మి ఖాయ‌మంటున్నారు.

అయితే.. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్న సీఎం కుమార‌స్వామి త‌న కొడుకు గెలుపు ఖాయ‌మ‌ని.. మూడు ల‌క్ష‌ల మెజార్టీ త‌ప్ప‌క వ‌స్తుంద‌ని చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ ఇదే ధీమాను ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న‌.. తాజాగా తన మాట‌ల్ని తాను స‌వ‌రించుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న కొడుకు గెలుపు త‌థ్య‌మంటూనే.. మెజార్టీ మాత్రం ల‌క్ష‌న్న‌ర‌కు త‌గ్గించేయ‌టం గ‌మ‌నార్హం. మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ నేత‌లు త‌న కొడుకు గెలుపు విష‌యంలో హ్యాండిచ్చిన‌ట్లుగా కుమార‌స్వామి భావిస్తున్నారు. వీరిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ ను కుమార‌స్వామి కోరిన‌ట్లుగా తెలుస్తోంది. కొడుకు మెజార్టీ త‌గ్గింపును సానుకూల దృష్టితో చూడాలంటున్నారు.

మిగిలిన నేత‌ల మాదిరి కాకుండా..రియ‌లిస్టిక్ అప్రోచ్ తో అంచ‌నా వేసుకొని.. తాను చెప్పిన మాట‌ల్ని స‌వ‌రించుకున్నారే త‌ప్పించి.. ఓట‌మికి అదేమాత్రం సంకేతం కాదంటున్నారు.ఇప్పుడున్న రాజ‌కీయాల్లో గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించ‌ట‌మే త‌ప్పించి.. ఓట‌మిని ఒప్పుకునే ప‌రిస్థితి ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. గ్రౌండ్ లో నెల‌కొన్న ప‌రిస్థితులు సుమ‌ల‌త వైపే మొగ్గుచూపుతున్నాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.





Tags:    

Similar News