కుప్పం హీట్.. బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు!

Update: 2022-08-25 08:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం ప‌ర్య‌ట‌నలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొల్లుపల్లిలో రెండు పార్టీల‌ ఘర్షణ నేపథ్యంలో ఆగ‌స్టు 25న కుప్పం బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.

పెద్దఎత్తున నిరసన తెల‌పాల‌ని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ప్ర‌తి పంచాయ‌తీ నుంచి 500 మంది కార్య‌క‌ర్త‌లు కుప్పం రావాల‌ని ఆ పార్టీ కోరింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా పిలుపు ఇచ్చింద‌ని చెబుతున్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రి వద్దకు ప్రతి పంచాయతీ నుంచి 500 మంది కార్యకర్తలు రావాలని వైఎస్సార్సీపీ కోరింది. అదేవిధంగా కుప్పంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బంద్‌కు అధికార పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

కాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలి రోజు ఆగ‌స్టు 24న‌ రామ‌కుప్పం మండ‌లం కొంగ‌న‌ప‌ల్లి, కొల్లుప‌ల్లి గ్రామాల్లో ప‌ర్య‌టించారు. అయితే చంద్ర‌బాబు వ‌చ్చే ముందు రోజు రాత్రే వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా వైఎస్సార్సీపీ తోర‌ణాలు, జెండాలు క‌ట్టార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త ఆ సభ‌కు వ‌చ్చి పార్టీ జెండా చూపి రెచ్చ‌గొట్టార‌ని అంటున్నారు. అతడికి మ‌ద్ద‌తుగా మ‌రో 20 మంది వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు జెండాలు చూపార‌ని చెబుతున్నారు. దీంతో గొడ‌వ రాజుకుంద‌ని.. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు.

పోలీసులు వారించేందుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశార‌ని స‌మాచారొం. ఈ ఘర్షణలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాళ్లబూదుగూరు ఎస్సై మునిస్వామితోపాటు పలువురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రబాబు కాన్వాయ్‌ కొల్లుపల్లికి వచ్చే ముందు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఓ ఇంట్లో పెట్టి తాళం వేయ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. దీనిపై చంద్రబాబు మండిప‌డ్డారు.

త‌న‌ సొంత నియోజకవర్గంలోనూ పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని నిప్పులు చెరిగారు. మ‌ద్యం పోయించి త‌న స‌భ‌లో గ‌లాటాకు వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పంపుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ, వైఎస్సార్సీపీ గొడ‌వ నేప‌థ్యంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి రామకుప్పం వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. మ‌రోవైపు రెండో రోజు ఆగ‌స్టు 25న గురువారం కూడా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ కుప్పం బంద్‌కు పిలుపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News