మాకు కరెంట్ లేకుంటే ఎవరికి ఉండొద్దంతే అంటున్నారట!

Update: 2019-09-29 05:21 GMT
మా ఇంట్లో కరెంటు లేకుండా.. పక్కింట్లో కరెంటు ఉంటే మేం ఒప్పుకోమంటే ఎలా ఉంటుంది? కరెంటు లేకపోవటానికి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా. అదేమీ పట్టించుకోకుండా.. మా ఇంటికి కరెంట్ లేనప్పుడు మా పక్కింటికే కాదు.. ఊళ్లో ఎవరికి కరెంటు ఉండకూడదన్న మాట ఊహించలేం కదా? సరిగ్గా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలోని కలుదేవకుంట గ్రామ ప్రజలు.

విన్నంతనే ఇదెక్కడి చోద్యంలా అనిపించే ఈ ఉదంతం లోతుల్లోకి వెళితే.. ఆ ఊరోళ్ల వాదనలోనూ కాస్త విషయం ఉందనిపించక మానదు. ఎందుకిలా అంటే.. కలుదేవకుంటలో వారం నుంచి రాత్రిళ్లు కరెంట్ సరఫరా తీసేస్తున్నారు. దీంతో.. రాత్రిళ్లు నిద్ర పట్టటం తగ్గటమేకాదు.. దోమలు.. విష పురుగులతో మహా ఇబ్బందిగా మారిందట. దీంతో.. ఆ ఊరు గ్రామస్తులంతా ఏకమై తాజాగా విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు.

కరెంటు ఇచ్చే వరకూ తిరిగి వెళ్లేది లేదని తేల్చటమే కాదు.. తమ ఊరికి కరెంటు ఇవ్వకపోవటానికి కారణం ఏమిటో ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని పట్టుపట్టారు. అంతేకాదు.. తమ ఊరికి కరెంట్ ఇవ్వనప్పుడు మిగిలిన ఊళ్లకు కరెంటు ఎలా ఇస్తారంటూ లాజిక్ తో ప్రశ్నిస్తున్నారు. అదంతే అన్న మాటకు ఆగ్రహించిన వారు.. తమ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా కరెంటు సఱపరాను బంద్ చేశారు. దీంతో.. కలుదేవకుంట చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ లేకుండా పోయింది. మీకు కరెంట్ లేకుంటే.. మాకు కరెంట్ ఎలా తీసేస్తారంటూ ఆయా గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూ రానున్న రోజుల్లో ఎంతవరకూ వెళుతుందో?
Tags:    

Similar News