2.30 గంటల్లో 13 బిల్లులు ఓకే అయితేనేనంట

Update: 2016-07-22 09:54 GMT
సీమాంధ్రులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు శుక్రవారం చర్చకు వచ్చి.. ఓటింగ్ జరుగుతుందంటూ హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్నటివరకూ ఒకటో నెంబరుగా ఉన్న కేవీపీ ప్రైవేటు బిల్లును 14వ బిల్లుగా మార్పులు చేయటంతో.. ఈ రోజు ఈ బిల్లు సభ ముందుకు వస్తుందా? లేదా? అన్నది సందేహం గారింది.

ఈ రోజు మొత్తం 18 ప్రైవేటు బిల్లులు సభ ముందుకు రావాల్సి ఉంది. వీటిల్లో కేవీపీ పెట్టిన ఏపీ ప్రత్యేక హోదా బిల్లును 14వ నెంబరు కేటాయించారు. అంటే.. కేవీపీ పెట్టిన బిల్లు రావాలంటే అంతకు ముందున్న 13 బిల్లుల మీద చర్చ.. మిగిలిన కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. మరోవైపు.. రాజ్యసభ ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడిన నేపథ్యంలో.. బిల్లు చర్చకు వచ్చే అవకాశం తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే..ఈ రోజు ప్రైవేటు బిల్లుల కోసం నిర్ణయించిన సమయం సాయంత్రం 5 గంటల వరకే. అంటే.. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ప్రారంభమై.. ఎలాంటి గొడవలు లేకుండా.. సాఫీగా సాగి.. ఒకటి తర్వాత మరొకటి వేగంగా క్లియర్ అయితే.. కేవీపీ పెట్టిన బిల్లు చర్చకు వచ్చేఅవకాశం ఉంది. అంతకు మించిన అనుకోని సంఘటనలు ఎదురైతే ఈ బిల్లు ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. ఇక.. ఈ రోజు పెట్టిన 18 ప్రైవేటు బిల్లుల్లో కేవీపీ పెట్టిన బిల్లు మీదే అందరి చూపులున్నాయి.

 ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. వరుస క్రమంలో నెంబరు వన్ లో ఉన్న కేవీపీ బిల్లును 14వ నెంబరుకు మార్చేందుకు జరిగిన ప్రయత్నాలకు కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నది ఒక ప్రశ్నగా మారింది. ఈ అంశాన్ని మొదట చర్చించాలంటూ ఎందుకు ప్రశ్నించలేదన్న సందేహానికి సమాధానం లభించని పరిస్థితి. మొత్తం రెండున్నర గంటల వ్యవధిలో 13 ప్రైవేటు బిల్లులు క్లియర్ అయితే తప్పిస్తే.. ఏపీ ప్రత్యేక హోదా బిల్లు సభ దృష్టికి వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు.

Tags:    

Similar News