ఏపీ కాంగ్రెస్ ను కేవీపీ బతికిస్తారా?

Update: 2016-03-12 06:40 GMT
 ఆంధ్రప్రదేశ్‌ లో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోసేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వెంటిలేటర్ అవతారం ఎత్తుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేవీపీ రాజ్య సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టడం ఈ దిశగా తొలి అడుగని అంటున్నారు. కాగా గతంలో పామోలిన్ రైతు సమస్యలను కూడా రాజ్యసభ వేదికగా కెసిపి రామచంద్రరావు ప్రస్తావించారు. ఏపి రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశంలేని తరుణంలో కేంద్ర స్థాయిలో రాజ్యసభ వేదికగా కెవిపి రామచంద్రరావు ప్రజా సమస్యల ప్రస్తావన తమ పార్టీకి ప్రయోజనం కలిగిస్తాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
   
ఏపికి ప్రత్యేక హోదా కోసం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని నెరవేర్చడంలో కెవిపి రామచంద్రరావు సఫలీకృతం అవుతున్నారన్న ఆనందం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఏపికి ప్రత్యేక హోదాపై ఎటూ తన వైఖరిని స్పష్టం చేయలేని దుస్థితిలో అధికార టిడిపి ఎదుర్కొంటోంది. ఈ రాజకీయ వాతావరణ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మల్చడంలో కెవిపి రామచంద్రరావు రాజకీయ చాతుర్యత ఆ పార్టీకి ఎంతో కలసివస్తోందని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని రాజ్యసభవేదికపై ప్రస్తావించడం ద్వారా జాతీయ పార్టీల దృష్టిని ఈ విషయంలో ఆకర్షించే ప్రయత్నం కెవిపి చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలోనూ - రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీలలోకి వలసలు వెళ్ళడం , రాజ్యసభసభ్యులు సైతం పార్టీకి దూరంగా ఉంటున్న ప్రస్తుత తరుణంలో కేవీపీ చొరవ ఆసక్తి కలిగిస్తోంది.
Tags:    

Similar News