విజయమ్మ వైఎస్ఆర్ ఆత్మీయ సమావేశానికి కేవీపీ.. క్లారిటీ ఇదే

Update: 2021-09-02 08:30 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు కొనసాగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించారు. హెలీక్యాప్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబర్ 2న చనిపోయారు. ఆయన మరణించి 12 ఏళ్లు పూర్తయింది. వైఎస్ఆర్ మరణించి పుష్కరకాలం గడిచిన సందర్భంగా ఆయన సతీమణి విజయలక్ష్మి గురువారం వైఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి వైఎస్ కాలంలో ఆయనతో పనిచేసిన 10100 రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, జర్నలిస్టులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా పిలవబడే కేవీపీ రామచంద్రారావుకు కూడా ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా పిలుపు వచ్చింది. అయితే ఆయన ఈ సమ్మేళనానికి హాజరుకావడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

అయితే కేవీపీ రామచంద్రారావును పిలవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొద్ది సేపటి క్రితమే ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ ‘నాకు విజయమ్మ ఫోన్ చేసి ఆత్మీయ సమ్మేళనానికి రమ్మన్నారు. వైఎస్ మీదున్న అభిమానంత వెళ్తున్నా.. అంతకుమించి ఏమీలేదు’ అని చెప్పారు. అయితే విజయమ్మ కాంగ్రెస్లోని కోమటి రెడ్డి బ్రదర్స్, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి లకు కూడా ఫోన్ చేసిన సమ్మేళనానికి రావాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా విజయమ్మ ఫోన్ చేయడంతో వీరంతా ఈ సమ్మేళనానికి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని నాయకులకు ఆహ్వానం పలికారు విజయమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, సినీ నటులు, ప్రముఖులు, అప్పటి అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.

అయితే ఈ సమ్మేళనంపై రకరకాల చర్చ సాగుతోంది. గత జూలైలో వైఎస్ఆర్ కూతురు షర్మిల తెలంగాణలో ‘వైసీపీ తెలంగాణ’ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసింది. ఈ పార్టీ ప్రారంభానికి ముందు షర్మిల తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని వైఎస్ అభిమానులను కలుస్తూ వస్తోంది. పార్టీ ప్రారంభించిన తరువాత నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ప్రతీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను కలుస్తూ వస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయితే రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆయన వ్యూహంలో భాగంగానే ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారని అంటున్నారు. అయితే విజయమ్మ మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ కాలంలో పనిచేసిన వారిందరికీ ఆహ్వానం పంపారు. మరోవైపు కేవీపీ లాంటి వారే వైఎస్ఆర్ అభిమానంతోనే సమ్మేళనానికి వెళ్తున్నామని చెబుతున్నారు.

కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం పాత మిత్రులను కలుపుకునేందుకేనన్న ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభంలో వైఎస్ విజయలక్ష్మి షర్మిల వెంటే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆమె వెంటే ఉంటున్నారు. ఓ వైపు ఆంధ్రలోని జగన్ వైసీపీ లో సభ్యురాలిగా ఉన్న విజయమ్మ ఇటు కూతురి వైసీపీ తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం వెనక రాజకీయ వ్యూహమేనన్న ప్రచారం సాగుతోంది.

వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతలోని హెచ్ఐసీసీలో నోవాటెల్ లో జరగబోతుంది. ఈ నోవాటెల్లోకి నిర్వహించే సమ్మేళనానికి ఎవరెవరు హాజరవుతారోనన్న ఆసక్తి మొదలైంది. మరోవైపు ఇక్కడ సమ్మేళం నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ తో పాటు వైఎస్ కాలంలో పనిచేసిన ఆంధ్ర వైసీపీలోని నాయకులు హాజరవుతారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News