టీఆర్ఎస్‌-టీడీపీల మ‌ధ్య అదేం లేద‌ట‌

Update: 2017-02-10 04:51 GMT
తెలంగాణలో అడ్ర‌స్ గ‌ల్లంత‌యిన నేప‌థ్యంలో ఉన్న కొంద‌రు నేత‌ల‌నైనా కాపాడుకునేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార టీఆర్‌ఎస్‌తో పొత్తుకు అర్రులు చాస్తోంద‌ని వ‌చ్చిన వార్త‌లు తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. ఈ నేప‌థ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వివ‌ర‌ణ ఇచ్చారు. అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితితో అంట‌కాగేందుకు దేశం సందేశం అంటూ వచ్చిన వార్త‌ల‌న్నీ వదంతులేన‌ని రమణ ఖండించారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో నిజమైన స్వాతంత్య్రం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. త‌మ పార్టీ మ‌నుగ‌డ తెలంగాణ‌లో ఎంతో అవ‌స‌ర‌మ‌ని ర‌మ‌ణ పేర్కొన్నారు. త‌మ‌కు టీఆర్ ఎస్‌ తో క‌లిసి ముందుకు పోయే ఉద్దేశం ఏ మాత్రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీపై దురుద్దేశ పూరితంగానే ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, టీడీపీ ఎదుగుద‌ల‌ను కొన్ని శ‌క్తులు ముఖ్యంగా వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ - తెరాస జీర్ణించుకోలేక పోతున్నాయ‌ని ర‌మ‌ణ వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీని అణిచివేసేందుకు  టీఆర్ ఎస్‌-వైసీపీల మ‌ధ్యే అవ‌గాహ‌న ఉంద‌ని ర‌మ‌ణ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు చీకటి మిత్రులుగా దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ర‌మ‌ణ విమ‌ర్శించారు. తెరాస సర్కార్ వైకాపాతో జత కట్టి, వైకాపా ఆంధ్రా ఎంపీలకు తెలంగాణ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు కట్టబెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును దోచిపెడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీని బలహీనపర్చాలని తెరాస, వైకాపాలు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని ఆరోపించారు. అయితే ఏపీలో వైకాపా తన ఉనికిని కోల్పోతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ-టీఆర్ ఎస్ పార్టీల తీరును ప్ర‌జ‌ల గ‌మ‌నిస్తున్నారని, ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని ర‌మ‌ణ తెలిపారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి ద‌క్కే ప్ర‌జాద‌ర‌ణ‌తో వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ పార్టీలు తెరమరుగవడం ఖాయమని ఆయ‌న జోస్యం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News