చైనాతో భారత్ వ్యూహం ఎలా ఉండాలో చెప్పిన మాజీ ఆర్మీ చీఫ్

Update: 2020-06-22 04:00 GMT
చైనా దుర్మార్గ వైఖరిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ దేశంతో భారత్ ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. ఆ దేశంతో పాటు.. దాయాదితోనూ సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న విషయంపై తాజాగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద ప్రకాశ్ మాలిక్ మాటలు ఆసక్తికరంగా మారాయి.  

ఓవైపు పాక్ తోనూ.. మరోవైపు చైనా తోనూ ఒకే సమయంలో పోరాడే సత్తా మన సైన్యానికి ఉందన్న ఆయన.. చైనా విషయంలో వ్యూహం మారిస్తే సరిపోతుందన్న కీలక వ్యాఖ్య చేశారు. గల్వానా ఉదంతం భారత్ విషయంలో ఒక కీలక మలుపుగా అభివర్ణించిన ఆయన.. చైనా విషయంలో మన కాస్త విధానాన్ని మార్చుకోవాలన్నారు. కేవలం ఆర్మీ విషయం లోనే కాదు.. ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా విధానాలు మారిస్తే సరి పోతుందన్న ఆయన.. చైనాతో పోలిస్తే పర్వత శ్రేణిలో యుద్ధం చేయటం లో మన బలగాలే నైపుణ్యాన్ని.. సంకల్పాన్ని కలిగి ఉంటాయన్నారు.

‘‘మరీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన బలగాలకు ఆ సామర్థ్యం ఉంది. తక్కువ ఆయుధాలు చేతిలో ఉన్నప్పటికి మన సైన్యం సరిహద్దుల్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ప్రస్తుత సైన్యానికి అంతటి సామర్థ్యం ఉంది’’ అన్న ధీమాను వ్యక్తం చేశారు. ఆర్మీ శక్తి సామర్థ్యాల మీద మొత్తం పట్టున్న వేద ప్రకాశ్ లాంటి ప్రముఖుడి నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News