బాబు, లగడపాటి మధ్య వారిద్దరూ మీడియేటర్లా?

Update: 2016-07-31 10:54 GMT
విజయవాడలో రహదారుల విస్తరణ - వైఎస్ విగ్రహం తొలగింపుతో మూలనున్న రాజకీయ మాజీలు కూడా బయటకొస్తున్నారు. విభజన అనంతరం రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఈ విషయంలో తాజాగా ప్రకటనలు చేస్తున్నారు. చాలాకాలంగా సైలెంటుగా ఉన్న ఆయన చంద్రబాబుకు సూచనలిస్తున్నారు. అయితే.. ఆయన స్వయంగా సూచనలు చేయకుండా టీడీపీలోనే ఇద్దరు మధ్యవర్తులను పెట్టుకున్నారు. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ - కేంద్రమంత్రి సుజనా చౌదరిలకు లగడపాటి ఫోన్ చేసి చంద్రబాబుకు మీరైనా చెప్పండంటూ వారితో మాట్లాడారు.

విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తొలగింపుపై  లగడపాటి రాజగోపాల్ స్పందించారు. విగ్రహం తీసివేత తగదని సీఎం చంద్రబాబుకు నచ్చజెప్పాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరి - ఎంపీ రమేశ్ లకు లగడపాటి స్వయంగా ఫోన్ చేశారు. ‘‘ముందు మీరు చెప్పి చూడండి. వైఎస్ విగ్రహం తొలగించడం కరెక్టు కాదు. చంద్రబాబుకు మీరు నచ్చెజెప్పండి. అప్పటికీ ఆయన వినకపోతే నేను కూడా వచ్చి మాట్లాడుతా’’ అని వారితో అన్నారట.

సుజనా - రమేశ్ లకు ఫోన్ చేసిన విషయాన్ని లగడపాటే స్వయంగా మీడియాకు వెల్లడించారు. విగ్రహం విషయంలో ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తాను టీడీపీ నేతలతో మాట్లాడినా పట్టించుకోకుండా విగ్రహం తొలగింపుపై తొందర పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ విగ్రహం విషయంలో అంతగా స్పందించిన లగడపాటి నేరుగా చంద్రబాబుతో మాట్లాడకుండా మధ్యలో ఆ ఇద్దరితో మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న విజయవాడ రాజకీయాల్లో షికారు చేస్తోంది.
Tags:    

Similar News