ఎన్టీఆర్ పేరు..ఫోటో వాడుకోవ‌ద్దంటున్న ల‌క్ష్మీపార్వ‌తి!

Update: 2018-11-03 10:47 GMT
ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. పుట్టుక‌తోనే వైరుధ్యం ఉన్న రెండు పార్టీలు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం ప‌డుతున్న పాట్ల‌పై కొత్త అంశం తెర మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ ను త‌ప్పు ప‌డుతూ.. ఆ పార్టీ ఓట‌మే ల‌క్ష్యంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సంగ‌తి ప్ర‌తి ఒక్క తెలుగోడికి తెలిసిన విష‌య‌మే.

తాను ఏ పార్టీని అయితే విప‌రీతంగా వ్య‌తిరేకించారో ఇప్పుడు అదే పార్టీతో చెట్టాప‌ట్టాలు వేసుకునేలా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై ఇప్ప‌టికే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఎన్టీఆర్ స‌తీమ‌ణి లక్ష్మీపార్వ‌తి తెర మీద‌కు వ‌చ్చారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు టీడీపీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఆత్మ‌కు శాంతి క‌ల‌గ‌కుండా నీచ రాజ‌కీయాలు చేస్తున్న చంద్ర‌బాబు తీరును ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.

కాంగ్రెస్‌.. టీడీపీలు పొత్తు పెట్టుకోవ‌టాన్ని ల‌క్ష్మీపార్వ‌తి ఖండించారు. ఎన్టీఆర్ కు బాబు మ‌రోసారి వెన్నుపోటు పొడిచారంటూ నిప్పులు చెరిగిన ఆమె.. ఈ రోజు (శ‌నివారం) ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద‌కు చేరుకొని నిర‌స‌న తెలిపారు. బాబు దుష్ట‌రాజ‌కీయాల‌పై ధ్వ‌జ‌మెత్తిన ల‌క్ష్మీపార్వ‌తి ఒక లేఖ రాసి స‌మాధిపైన పెట్టారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టం ద్వారా ఎన్టీఆర్ కు మ‌రోసారి వెన్నుపోటు పొడిచార‌న్నారు.

ఏ రోజూ కేంద్రానికి దాసోహం అన‌కుండా.. త‌ల‌వంచ‌కుండా ఎన్టీఆర్ పాలించిన వైనాన్ని గుర్తు చేసిన ల‌క్ష్మీపార్వ‌తి.. కేవ‌లం రాజ‌కీయ స్వార్థం కోసం కాంగ్రెస్ తో బాబు జ‌త‌కట్టార‌ని.. మ‌హ‌నీయుడైన ఎన్టీఆర్ పేరును ఉచ్చ‌రించే అర్హ‌త కూడా బాబుకు లేద‌న్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ తీరును త‌ప్పు ప‌ట్టిన ఆమె.. ఎన్టీఆర్ పేరును కానీ.. ఆయ‌న ఫోటోను కానీ ప్ర‌చారానికి వాడుకోవ‌టానికి వీల్లేద‌న్నారు.


Tags:    

Similar News