మోడీని అవన్నీ ఓటమిపాల్జేశాయట!

Update: 2016-12-23 04:23 GMT
పెద్దనోట్ల నిర్ణయం మంచి ఉద్దేశ్యంతో తీసుకున్నట్లు పలువురు సమర్ధిస్తున్నప్పటికీ.. ఆ నిర్ణయం అమలు విషయంలో జరిగిన వైఫల్యాలు - లోపాల విషయంలో గరిష్ట ప్రజానికానికి రెండో ఆలోచన లేకుండా ఆగ్రహావేశాలు - అసహనం పెరిగిపోయాయని తాజా పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. నిర్ణయం మాత్రమే మంచిదైతే సరిపోదు.. దాన్ని అమలుపరిచే విషయంలో కూడా సమర్ధత ఉండాలనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలోని నోట్ల రద్దు - అనంతర ఫలితాలు - వైఫల్యాలపై తాజాగా ఆర్జేడీ చీఫ్ - బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు.

దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం - అనంతర వైఫల్యాలు మోడీని ఇప్పటికే ఓటమిపాలు చేశాయని అంటున్నారు లాలూప్రసాద్‌ యాదవ్‌. నోట్లరద్దు విషయంలో ఎవరు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఈ నిర్ణయం ఓ ఘోర అపజయంగా మిగిలిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం అంతా సహనంగా ఉన్నట్లు అనిపిస్తున్నా ఈ విషయంలో ప్రజలు ఒక్కసారి సహనం కోల్పోతే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే వస్తుందని, ఈ విషయంపైనా, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైనా ప్రధాని ఎటువంటి వివరణలు ఇచ్చినా వాటిని ప్రజలు వినే పరిస్థితులు కనిపించడంలేదని లాలూ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విషయంలో మోడీ ఇప్పటికే ఓటమిని ఒప్పుకున్నట్లు అభిప్రాయపడిన లాలూ... నోట్లరద్దు అనంతరం గోవాలో మోడీ ప్రసంగంలో ప్రతి మాటనూ గుర్తుచేసుకోవాలని వాటిలో ప్రధానంగా... ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని చెప్పడాన్ని చూపిస్తున్నారు! ఇదే క్రమంలో ఇకపై కూడా ఈ విషయంపై ఎవరు ఎలాంటి మాటలు చెప్పిన వినే స్థితిలో ప్రజలు లేరని, దేశంలో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంలో దేశంలోని ఎలాంటి మురికి పారద్రోలారో కూడా చెప్పాలని, అసలు ఈ నోట్ల రద్దు నిర్ణయంవల్ల దేశానికి వచ్చిన ప్రయోజనం ఏంటో వివరించాలని లాలూ డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News