మోడీకి లాలూ శాపాలు

Update: 2017-05-23 12:18 GMT
ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీకి శాపాలు పెడుతున్నారు. అయితే... తన మనసులోని శాపాలను ఆయన జాతక రూపంలో బయటపెడుతున్నారు. తనకు జ్యోతిష్యం తెలుసని, నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే అధికారం కోల్పోతుందని ఆయన అంటున్నారు.
    
లాలూకు సంబంధించిన ఇళ్లు, గెస్టు హౌస్ లపై ఆదాయ పన్ను శాఖ దాడులు ఉదృతంగా జరుగుతున్నాయి. అయితే.. ఆయనకు సంబంధించిన 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారన్న విషయాన్ని ఆయన ఖండిస్తున్నారు.  ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో లాలుకు సంబంధం ఉన్న 22 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి సోదాలు చేశారంటూ కథనాలు వస్తుండడంపై ఆయన మండిపడుతూ... ఆ ప్రాంతాలు ఏంటని ఆయన విలేకరులను ఎదురు ప్రశ్నించారు.
    
అంతేకాదు... నరేంద్రమోదీ ప్రభుత్వం మీద కూడా ఆయన తీవ్రంగా విరుచకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేయబోదని తాను స్పష్టంగా చెప్పగలనని ఆయన అన్నారు.
    
కాగా లాలు ఫ్యామిలీ ఇటీవల అనేక ఆరోపణల్లో చిక్కుకుంది. ఆయన కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లు బలవంతంగా లాక్కున్న భూమిలో ఓ పెద్ద మాల్‌ను నిర్మిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే లాలు మాత్రం అవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండిస్తున్నారు. అదంతా డబ్బు పెట్టి కొనుగోలు చేసిన భూమి అని చెబుతున్నారు.


Tags:    

Similar News